Telugu Gateway
Politics

సిద్ధూ రాజీనామా

సిద్ధూ రాజీనామా
X

పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారు కాగా..అధికారంలో ఉన్న పంజాబ్ లో కూడా విభేదాలు తీవ్ర స్థాయికి చేరటం కలకలం రేపుతోంది. పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాసిన లేఖను ట్వీటర్‌లో షేర్ చేశారు. జూన్‌ 10నే ఈ లేఖను రాహుల్‌ గాంధీకి ఇచ్చారు. ముఖ్యమంత్రి అమరీందర​సింగ్‌ ఇటీవల చేపట్టిన మంత్రివర్గం విస్తరణతో సిద్ధూ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.

అమరీందర్‌ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్‌ ఘాటు విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు రావడానికి సిద్ధూ అసమర్థతే కారణమని ఆయన నిందించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్లో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్‌ గాంధీతో సిద్ధూ గత నెల 10న ప్రత్యేకంగా సమావేశంమయ్యారు.

Next Story
Share it