Telugu Gateway
Andhra Pradesh

బిజెపితో జనసేన కలవదు

బిజెపితో జనసేన కలవదు
X

ఎన్నికల తర్వాత కూడా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గానే సాగుతున్నాయి. ఓ వైపు వైసీపీ అప్రతిహత గెలుపుతో పరిపాలనపై ఫోకస్ పెట్టగా..కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా ఏపీలో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అది టీడీపీని అసెంబ్లీలో నిట్టనిలువునా చీల్చి బలోపేతం అవుతుందా? లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా అన్నదే కాలమే తేల్చాలి. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరి అంచనాలకు భిన్నంగా రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. తాను రాజకీయాలు వదిలి పెట్టి పోనని..ఇక్కడే తాడోపేడో తేల్చుకుంటానని చెబుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికాలో జరిగిన తానా సభల్లో పాల్గొన్నారు. అక్కడ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో పవన్ కళ్యాణ్ ప్రత్యకంగా సమావేశం కావటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ బిజెపిలో జనసేనను కలిపే ప్రశ్నేలేదన్నారు. అయితే బిజెపితోకానీ ఏ పార్టీతో కానీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు. అయితే ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్ష బలంగా ఉందన్నారు.

అంతకు వర్జీనియాలో జనసేన అభిమానుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. నిజంగా సీట్లు గెలవాలని రాజకీయం చేసేవాడిని అయితే టీడీపీ, బిజెపితో ఎందుకు ఘర్షణ పడతానని..గెలిచే సీట్లు తీసుకుని పొత్తు పెట్టుకునే వాడిని కదా? అని ప్రశ్నించారు. 2024 వరకూ మన పార్టీ ఉంటుందా అని కొందరు అడుగుతున్నారు. వాళ్లకు నేను ఒక్కటే చెప్పాలని భావిస్తున్నాను. గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు ప్రయాణం చేయడమే నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. విత్తే మొలకెత్తడానికి అనేక కష్టాలు పడుతుంద ని.. అలాంటి కోట్లాది మంది భవిష్యత్‌ను నిర్దేశించే రాజకీయ పార్టీ నడపాలంటే చాలా కష్టాలు అనుభవించాలని అన్నారు.

‘ఒక్క అపజయం నన్ను వెనక్కి లాగలేదు. డబ్బుతో ముడిపడిన రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. కోట్లాది మంది భవిష్యత్‌ను నిర్దేశించాలంటే అనుభవం కావాలి. 25 ఏళ్లు ప్రయాణించాలంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొవాలి. ఓడిపోయాక మనకెన్ని ఓట్లు వచ్చాయని మా నాయకుల్ని అడిగాను. 7-8 శాతం వచ్చాయన్నారు. అంటే లక్షల మంది మనల్ని గుర్తించారని.. వారికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు వెళ్దామని చెప్పి పార్టీ కార్యకలాపాల్లోకి వెళ్లిపోయాను. నేను గులాంగిరీ చేసి బతకలేను. ఆత్మగౌరవంతో వెళ్తాను. ‘అడుగడుగునా పరాజయం వెనక్కి వెళ్లిపొమ్మని బెదిరిస్తుంది. కానీ ధైర్యంతో ముందుకే వెళ్దాం. అపజయమనే వ్యర్థాలను తొలగించుకొంటూ విజయం దిశగా వెళ్దాం. ఓటమి లేదు. మజిలీయే ఉంది. జనసేన లక్ష్యం కచ్చితంగా సాధిద్దాం’ అని పిలుపిచ్చారు.

Next Story
Share it