సాగదీసినా...కుమారస్వామి సర్కారు ఆగలేదు

సాగదీశారు. సాగదీశారు. అయినా సరే..కుమారస్వామి కర్ణాటకలో తన సర్కారును నిలబెట్టుకోలేకపోయారు. దీంతో బిజెపి ప్లాన్ వర్కవుట్ అయిందనే చెప్పాలి. పధ్నాలుగు నెలల సంకీర్ణ పాలనకు తెరపడింది. ఇక బిజెపి తెరమీదకు రానుంది. కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా సర్కారు కొలువుదీరటం కేవలం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ నెల మొదటి వారంలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. గవర్నర్ విధించిన గడువులు కూడా ముగిశాయి. చివరి అంకంగా స్పీకర్ సూచన మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ నుంచి 65 మంది, జేడీఎస్‌కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది.