Telugu Gateway
Andhra Pradesh

కేశినేని నాని చంద్రబాబుకే హెచ్చరిక పంపారా?

కేశినేని నాని చంద్రబాబుకే హెచ్చరిక పంపారా?
X

తెలుగుదేశం పార్టీలో ట్విట్టర్ రగడ పీక్ కు చేరింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏకంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికే వార్నింగ్ ఇచ్చిన తరహాలో ట్వీట్ చేయటం తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారం రేపుతోంది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య సాగిన ట్విట్టర్ యుద్ధం సెగ ఇప్పుడు ఏకంగా చంద్రబాబుకు కూడా తాకింది. ‘పార్టీలో నాలాంటి వాళ్లు వద్దనుకుంటే చెప్పండి. పార్లమెంట్ సభ్యత్వంతో పాటు..టీడీపీకి కూడా రాజీనామా చేస్తా. నాలాంటి వాళ్ళు పార్టీలో ఉండాలనుకుంటే మాత్రం మీ పెంపు కుక్కను కంట్రోల్ చేయండి చంద్రబాబు గారూ’ అంటూ ట్వీట్ చేశారు. ఇది టీడీపీలో పెద్ద కలకలంగా మారింది. అసలు నాని ఏ ఉద్దేశంతో ఈ రగడకు కారణం అవుతున్నారు అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. కేశినేని నాని తాజా ట్వీట్ పై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా స్పందించారు.

తనకు ఎమ్మెల్సీ పదవి ఇఛ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి విశ్వాసపాత్రుడిగా ఉంటానని..తనకు కొంత మంది ఎలాంటి పేర్లు పెట్టుకున్నా ఇబ్బంది ఏమీలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇక నుంచి తాను ట్విట్టర్ కామెంట్లకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కేశినేని నానితో అధిష్టానం చర్చలు జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి నాని ప్రస్తుతం చంద్రబాబుతో భేటీకి సిద్ధపడతారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఇఫ్పటికే పరాజయ భారంతో సతమతం అవుతున్న టీడీపీకి పార్టీలో నేతల మధ్య గొడవలు పెద్ద తలనొప్పిగా మారాయి.

Next Story
Share it