కరవు పరిస్థితిపై అసెంబ్లీలో జగన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లోని రైతులపై జగన్ వరాల వర్షం కురిపించారు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను శాసనసభలో లేవనెత్తారు. ఏపీలోని కరవు పరిస్థితిపై సీఎం జగన్ గురువారం నాడు సభలో ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చి నెల రోజులే అయిందని..గత ప్రభుత్వం విత్తనాల సేకరణ లో కూడా విఫలమైందని విమర్శించారు. నవంబర్ లోనే విత్తనాల సేకరణ ప్రారంభమై ఏప్రిల్ కు పూర్తి కావాలని..కానీ కేవలం 50 క్వింటాళ్ళ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచారని ఆరోపించారు. విత్తనాల కోసం అధికారులు లేఖలు రాసినా కూడా గత ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదని అన్నారు. పాడి రైతులకు లీటర్ కు 4 రూపాయలు పెంచబోతున్నట్లు తెలిపారు. గత ఎన్నికలకు ముందు రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి..చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రకటనలకు సంబంధించి వీడియోలను సభలో వేసి మరీ చూపించారు. వర్షాభావం వల్ల ఏపీలో ప్రస్తుతం పంటల సాగు పెద్దగా ఊపందుకోలేదని అన్నారు.
రైతులకు ఎంత మేర సాయం చేయాలో అంత చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని...రైతుల కోసం ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. అలాగే రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి సభాముఖంగా తెలిపారు. మన రాష్ట్రంలో 62శాతం మంది రైతులేనని... ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడి సాయం అందిస‍్తామని అన్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.384 కోట్ల బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లిందని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు తమ ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం ఇస్తుందని తెలిపారు. అక్టోబర్ 15 నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. అలాగే 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపు చేస్తామని, దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు అని అన్నారు. ఏటా జూన్ నుంచి జులై 10 నాటికి సగటున 9.10 లక్షల హెక్టార్లలో విత్తనాలు, నాట్లు వేస్తారు. ఈ ఏడాది కేవలం 3.2 లక్షలహెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. వర్షాలు ఆలస్యమయ్యాయి. గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వీటిని అన్నింటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇదే సమయంలో మరికొన్ని నిజాలను కూడా ఈ సభలో ఉంచుతున్నాను అని తెలిపారు.