Telugu Gateway
Andhra Pradesh

నేను కూడా ‘నిప్పే’ అంటున్న నారా లోకేష్

నేను కూడా ‘నిప్పే’ అంటున్న నారా లోకేష్
X

ఎమ్మెల్సీ నారా లోకేష్ గురువారం నాడు శాసనమండలి వేదికగా రెచ్పిపోయారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి తరహాలోనే ఆయన తాను కూడా ‘నిప్పు’లా బతికానని ప్రకటించారు. ఓ మంత్రి తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని..దీనికి సంబంధించి ఆధారాలు ఉంటే చూపాలని..తానేమి అక్రమంగా కంపెనీలకు నిధులు మళ్ళించలేదని..16 నెలలు జైలులో ఉండలేదని వ్యాఖ్యానించారు. 46 వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయలేదని..సీఎంపై 11 ఛార్జిషీట్లు లేవా? శుక్రవారం..శుక్రవారం కోర్టుకు హాజరు కావటంలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది మండలిలో దుమారం రేపింది. విదేశాల్లో చదువుకున్నందున కొన్ని పదాలు తెలుగులో తప్పు మాట్లాడి ఉండొచ్చని..అందులే తప్పేముందని నారా లోకేష్ ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు.

సభలో లేని ముఖ్యమంత్రిపై లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆదిమూలపు సురేష్‌ తీవ్రంగా ఖండించారు. సభలోలేని వ్యక్తుల గురించి అనవసరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్‌తో కుమ్మక్కై చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారన్నారని ఆరోపించారు. కేసులపై స్టే తెచ్చుకొని చంద్రబాబు బయట తిరుగుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్నాడు కానీ తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ సొంతంగా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసి గెలిచిందా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు.

Next Story
Share it