Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్

తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్
X

సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత విషయంలో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు అయింది. హైకోర్టులో ఈ అంశంపై ఉన్న కేసు తేలేవరకూ భవనాలు కూల్చవద్దంటూ సర్కారును కోర్టు ఆదేశించింది. భవనాల కూల్చివేత అంశంపై హైకోర్టు సోమవారం నాడు రెండు దఫాలు వాదనలు విని..తర్వాత బుధవారానికి విచారణను వాయిదా వేసింది. భవనాల కూల్చివేతపై కౌంటర్ దాఖలుకు 15 రోజుల సమయం కావాలని తొలుత కోరిన ప్రభుత్వ అడ్వకేట్..అప్పటివరకూ భవనాలు కూల్చివేయవద్దంటూ హైకోర్టు ఆదేశించటంతో సోమవారం మధ్యాహ్యానికే కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. కౌంటర్ దాఖలు తర్వాత కూడా కోర్టు కేసు తేలేవరకూ భనవాలు కూల్చొద్దని కోరటంతో..ఇదే విషయాన్ని సర్కారుకు నివేదిస్తామని అడిషినల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవన నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ప్యాలెస్‌ అనుమతి లేకుండా ఎర్రమంజిల్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ నవాబు వారసులు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఎర్రమంజిల్‌లో ఉన్న 12 ఎకరాల భూమికి పరిహారం చెల్లించాలని కోరారు.

1951 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో... తుదితీర్పు వెలువడకముందే అసెంబ్లీ భవనాన్ని ఎలా నిర్మిస్తారని పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సామాజిక వేత్త పాడి మల్లయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఇక చరిత్రాత్మక ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు విపక్షాలు అన్నీ కూడా సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేతను వ్యతిరేకిస్తున్నాయి.

Next Story
Share it