Telugu Gateway
Politics

సచివాలయం కూల్చివేతపై అమిత్ షాకు వివేక్ ఫిర్యాదు

సచివాలయం కూల్చివేతపై అమిత్ షాకు వివేక్ ఫిర్యాదు
X

మాజీ ఎంపీ వివేక్ మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణ సర్కారు ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని అవసరం లేకపోయినా పడగొట్టి..కొత్త నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించిందని ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని అందజేశారు. తన కుమారుడితో కలసి వివేక్ అమిత్ షాతో సమావేశం అయ్యారు. త్వరలోనే వివేక్ బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ కూడా ఉన్నారు.

సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని వివేక్ కోరారు. ముఖ్యంగా బీజేపీలో చేరికపై వివేక్‌ అమిత్‌ షాతో చర్చించినట్టుగా తెలుస్తోంది. వివేక్‌ బీజేపీలో చేరాడం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత వివేక్‌ బీజేపీలో చేరనున్నారని చెబుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని.. అయితే ప్రస్తుతం ఆషాఢ మాసం కావడంతో వారు తమ చేరికను వాయిదా వేసుకుంటున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని చెబుతున్నారు.

Next Story
Share it