Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఏపీ దేశానికి ఆద‌ర్శం అవుతుంది

0

రాబోయే రోజుల్లో దేశం ఏపీని చూసి నేర్చుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత వ‌ర‌కూ అవినీతి నిరోధంపై అంద‌రూ మాట‌లే చెప్పారని..తాను చేత‌ల్లో చూపించ‌టానికి రెడీ అయ్యాయ‌ని తెలిపారు. గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో ఎక్క‌డ చూసినా అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. త‌న ప్ర‌భుత్వంలో అవినీతికి తావు లేకుండా..పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేసేందుకే అత్యంత కీల‌క‌మైన బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు జ‌గ‌న్ తెలిపారు. అవినీతిని నిరోధించడానికి, మరింత మెరుగైన పరిపాలన అందించడానికి ముందస్తు న్యాయ సమీక్ష బిల్లు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు ఓ చారిత్రాత్మకమైన బిల్లును తీసుకువచ్చాం. దేశ చరిత్రలోనే పారదర్శకత ఏపీ నుంచి మొదలు అవుతోంది. వ్యవస్థలో మార్పు తీసుకు రావడానికి ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుందనేది సభ్యులు ఇప్పటికే సభలో చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసిన అవినీతి కనిపిస్తోంది. వ్యవస్థలో మార్పు రావాలంటే ముందుగా ఎవరైనా ప్రారంభిస్తేనే వస్తుంది. ముందస్తు న్యాయసమీక్ష అనేది ఇప్పటివరకూ దేశ చరిత్రలో ఎక్కడ జరుగలేదు. నిజంగా ఏం చేస్తే అవినీతి లేకుండా చేస్తామన్నది ఎప్పుడు జరగలేదు.
గత ఐదేళ్ల చంద్రబాబు పాలన గమనిస్తే..మనం కూర్చున్న ఈ బిల్డింగ్‌ గమనిస్తే స్కామ్‌ కనిపిస్తుంది. తాత్కాలిక భవనం కట్టడానికే అడుగుకు రూ.10 వేలు ఖర్చు అయిన పరిస్థితి చూశాం. ఏదీ తీసుకున్నా కూడా స్కామ్‌లమయమే. ఈ బిల్లు ద్వారా రూ.100కోట్లు, దానికి పైబడిన ప్రతి టెండర్‌ ప్రభుత్వ టెండర్‌ ఏదైనా జడ్జి పరిధిలోకి వస్తుంది. టెండర్ల పరిశీలనకు హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు అవుతుంది. నియమించిన జడ్జి ఒక్కసారి బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రభుత్వం పిలిచే ఏ టెండర్‌ అయినా సరే ఆ జడ్జి వద్దకు పంపిస్తాం. ఆ జడ్జి ఆ టెండర్‌ డాక్యుమెంట్‌ పబ్లిక్‌ డొమైన్‌లో వారం రోజుల పాటు పెడతాం. నేరుగా జడ్జికే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఆ జడ్జి వద్ద టెక్నికల్‌గా తోడుగా ఉండేందుకు ఎవరినైనా కోరవచ్చు అని తెలిపారు. జడ్జి వీళ్లు ఎవరూ వద్దు, ఫలాని వారు కావాలని కోరితే వారిని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. జడ్జి టెండర్‌కు సంబంధించిన సలహాలు తన వద్ద ఉన్న టెక్నికల్‌ టీమ్‌తో చర్చిస్తారు. ఆ తరువాత జడ్జి సంబంధిత శాఖను పిలిచి తాను ఏదైతే సబబు అనుకుంటారో..వాటిని సూచిస్తూ మార్పులు చేస్తారు. అదే మార్పులు తూచా తప్పకుండా చేసిన తరువాతే టెండర్‌ డాక్యుమెంట్‌ పూర్తి చేస్తాం.
ఇంత నిజాయితీగా, పారదర్శకంగా ఒక వ్యవస్థను తయారు చేయడం దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఎక్కడా జరుగలేదు. పారదర్శకత ఒక స్థాయి నుంచి మరోస‍్థాయికి తీసుకు వెళ్లడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. దీనివల్ల పూర్తిగా నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. లోకాయుక్తా బిల్లును కూడా ఇవాళ తీసుకువచ్చాం. గతంలో ఈ బిల్లు ఎందుకు లేదు అంటే దానికి సమాధానం లేదు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీలో లోకాయుక్తా అన్నది లేనే లేదు. అవినీతి లేకుండా ఉండాలని గత ప్రభుత్వం అనుకుని ఉంటే ఇది జరిగేది కాదు. కానీ ఆ ఆలోచన వారికి లేదు. చిన్న చిన్న మార్పులు చేస్తే ఇది జరిగి ఉండేది. లోకాయుక్తలో ఒక సిట్టింగ్‌ జడ్జి గాని, రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉంటేకాని లోకాయుక్తను నియమించలేమన్న నిబంధనను కాస్త మార్పు చేసి ఉంటే అయిదేళ్ల క్రితమే లోకాయుక‍్త వచ్చి ఉండేది. కానీ లోకాయుక్త అన్నది రానేరాకుండా, గత అయిదేళ్లుగా పెండింగ్‌లో పెట్టారంటే ఈ వ‍్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.