Telugu Gateway
Politics

కాంగ్రెస్ లో కలకలం

సార్వత్రిక ఎన్నికల షాక్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోవటం లేదు. ఆ పార్టీలో ప్రకంపనలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ మరోసారి తన మాటకే కట్టుబడి ఉన్నట్లు తేల్చిచెప్పారు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. తాను సుశిక్షితుడైన కార్యకర్తగా పనిచేస్తానని..అధ్యక్ష పదవి తప్ప దేనికైనా రెడీ అంటూ పేర్కొన్నారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయటంలో కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న జాప్యం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన సమయంలో తాను కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సీడబ్ల్యూసీని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను పార్టీ అధ్యక్ష పదవిలో లేనని స్పష్టం చేశారు. నూతన అధ్యక్షుడి నియామకంపై పార్టీ సత్వరమే స్పందించాలని కోరారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తక్షణమే సమావేశమై నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు పార్టీ అధ్యక్ష హోదాలో కొనసాగాలని పార్టీ క్షేత్ర స్ధాయి నేతల నుంచి, పార్టీ సీఎంల వరకూ రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చినా రాహుల్‌ గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పార్టీ నేతలు రాజీనామాలు సమర్పించినా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ నూతన చీఫ్‌ ఎంపిక ప్రక్రియను చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాహుల్ తాజా నిర్ణయంతో మోతీలాల్ వోరాను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. నూతన అధ్యక్షుడిని నియమించే వరకూ ఆయనే ఈ పదవిలో కొనసాగుతారు.

Next Story
Share it