Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు శుక్ర‌వారం నాడు ప్ర‌కాశం జిల్లాలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప్ర‌భుత్వం శాశ్వ‌తం కాద‌ని గుర్తించుకుని మ‌స‌లుకోవాల‌న్నారు. రాష్ట్రంలో టీడీపీ నేత‌లు..కార్య‌క‌ర్త‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎందుకు స్పందించ‌ర‌ని ప్ర‌శ్నించారు. హోం మంత్రి సుచ‌రిత మాత్రం అలాంటివి జ‌రుగుతుంటాయ‌ని వ్యాఖ్యానించ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘నాకు రక్షణ కల్పించడంలేదు, భద్రత విషయంలో జోక్యం చేసుకున్నారు. నాకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్‌ చేయలేరు’ అని స‌ర్కారును హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలో ఆత్మహత్య చేసుకున్న పద్మ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. పద్మ కుటుంబానికి రూ.7.65 లక్షల ఆర్థికసాయం అందజేశారు.మహిళను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి తన్నితన్ని చంపారని ఆరోపించారు. వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం దారుణమన్నారు. ఓ ఆడబిడ్డ పట్ల వీళ్లు అనుసరించిన తీరు అనాగరికమని ధ్వజమెత్తారు. కళ్ల ముందే దోషులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?. రాష్ట్రాన్ని మరో పులివెందుల చేద్దామనుకుంటున్నారా?. డీజీపీ దగ్గరకు వెళ్లి మెమోరాండం ఇస్తే ఎగతాళి చేశారు. ప్రజలు తిరగబడితే మీరేం చేయలేరు’ అని విమ‌ర్శించారు.

Next Story
Share it