Telugu Gateway
Andhra Pradesh

అప్పుడు జగన్ ఫిర్యాదు చేస్తే..ఇప్పుడు సీబీఐ దాడి

అప్పుడు జగన్ ఫిర్యాదు చేస్తే..ఇప్పుడు సీబీఐ దాడి
X

‘ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)లో ఉండి ఆయన చంద్రబాబునాయుడు ఏది చెపితే అది చేస్తున్నారు. కావాలని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు.’ ఇదీ ప్రతిపక్షంలో ఉండగా కొన్ని సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్రమోడీకి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ పెద్దగా చర్యలు లేవు. కాకపోతే ఆయన తర్వాత ఈడీ నుంచి మారిపోయారు. ఇప్పుడు అదే బొల్లినేని శ్రీనివాస్ గాంధీ (బీఎస్ గాంధీ)పై సీబీఐ దాడులు జరిగాయి. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇది బీఎస్ గాంధీతో ఆగుతుందా? లేక రాజకీయ నేతలవైపు కూడా తిరుగుతుందా? అన్న టెన్షన్ కొంత మందిలో నెలకొంది. ఏది ఏమైనా తాజా ఫరిణామాలు ఏపీలోని తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయనే చెప్పొచ్చు. జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై మంగళవారం నాడు సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్నా ఆరోపణలతో అధికారులు తొలుత ఆయనపై కేసు నమోదు చేసి.. దాడులు చేపట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌.. పదేళ్లకు పైగా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌లో పనిచేశారు.

ప్రసుత్తం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన వద్ద నాలుగు కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు చేశారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఐపీసీ సెక్షన్ 109,13(2),13(1బీ) ప్రకారం అధికారులు కేసు నమోదు చేశారు. హోదాను అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించినట్లు విచారణలో వెలుగులోకి వస్తోంది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుసింది. అధికారులు ఇ‍ప్పటి వరకు గుర్తించిన ఆస్తుల వివరాలు... కంకిపాడులో మూడు స్థలాలు, ప్రొద్దుటూరులో ఇళ్లు, కానూరులో 360 గజాల స్థలం, రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో 300 గజాల స్థలం, మరో రెండు స్థలాలు, మదీనా గూడలో పది కుంటలు, విజయవాడ కంకిపాడులో 43 సెంట్లు, తుళ్లూరులో 42 సెంట్ల స్థలం, కంకిపాడులో 2.96 సెంట్ల స్థలం, బ్యాంకు ఖాతాలో భారీగా నగదును గుర్తించారు. కూకట్ పల్లి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో రూ‌‌.20 లక్షలు, బంధువులు నరసింహారావు,శ్రీలత ఖాతాలో పది‌లక్షల నగదు, కుటుంబ సభ్యులపై ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసినట్లు తెలిసింది.

Next Story
Share it