ఆ ఐఏఎస్ కు చుక్కలు చూపించిన ‘ముఖ్య’నేత!
గత ప్రభుత్వంలో ఆయన చలాయించిన అధికారం అంతా ఇంతా కాదు. సహచార ఐఏఎస్ అధికారులనే వేధించారు. అంతే కాదు..సీనియర్లను కూడా అవమానించారు. అధికారం అండతో ఇష్టానుసారం చెలరేగిపోయారు. రాజకీయ నాయకుల తరహాలో తనకంటూ ఓ ప్రత్యేక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?. సీన్ కట్ చేస్తే ముఖ్య నేత అపాయింట్ మెంట్ కోసం ఏకంగా పది గంటలు వేచిచూడాల్సిన పరిస్థితి. అంత సేపు ఎదురుచూసినా ఫలితం శూన్యం. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఇఫ్పుడు అందరి చుట్టూ తిరుగుతూ పోస్టింగ్ కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఎంత దారుణం అంటే ముఖ్య నేత అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూసిన ఆ సీనియర్ ఐఏఎస్ కనీసం భోజనం కూడా చేయకుండానే అక్కడ ఉండిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
సదరు ఐఏఎస్ కీలక హోదా వెలగబెట్టిన సమయంలో కొంత మంది మంత్రులను కూడా లెక్కచేయని పరిస్థితి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎవరైనా అధికారం చేతిలో ఉంటే చేతనైనంత మందికి సాయం చేసి మంచి పేరు తెచ్చుకోవాలే కానీ..ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకోకూడదని సహచార ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మంచి చేయటం చేతకాకపోతే మౌనంగా ఉన్నా పెద్దగా ఎవరూ కక్షలు పెంచుకోరు. కానీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని మర్చిపోయి రెచ్చిపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. కనీసం ఆయనపై సానుభూతి చూపించేవారు కూడా లేని పరిస్థితి.