కెసీఆర్ అసలు ప్లాన్ అదేనా?!
‘హైదరాబాద్ కు సమైక్య పాలకులు చేసింది ఏముంది?.ఒక్క పెద్ద వర్షం వస్తే అసెంబ్లీ ముందు నీరు నిండిపోతుంది. సచివాలయం, రాజ్ భవన్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. కానీ మేం ఒక్క ఏడాదిలోనే పరిస్థితిని మార్చేస్తాం’ ఇదీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలో ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఏడాది కాదు..ఐదేళ్ళు దాటి ఆరో సంవత్సరంలోకి ప్రవేశించినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. పైగా గతంలో ఎన్నడూలేని రీతిలో ఒక్క వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ నగరం అంతా గంటల తరబడి ‘ట్రాఫిక్ లో ఆగిపోతుంది’. ఈ అంశంపై పెద్దగా ఫోకస్ పెట్టని సర్కారు మాత్రం అంతగా అవసరం లేకపోయినా..అత్యవసరం కాకపోయినా ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణానికి రెడీ అయిపోయింది. గురువారం నాడే సచివాలయం, అసెంబ్లీ భవనాలకు సీఎం కెసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఓ వైపు పాత సచివాలయం పడగొడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా ఆర్ధిక శాఖ అధికారులు మాత్రం సచివాలయంలోని డీ బ్లాక్ లో కోట్లాది రూపాయల వ్యయంతో రిపేర్లు చేయించుతూనే ఉన్నారు.
ఆ పనులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొంత మంది మంత్రులు కూడా కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఛాంబర్లలో హంగామా చేయించుకున్నారు. ఇప్పుడు మరి ఆ భవనాలు కూలిపోనున్నాయి. ప్రజల డబ్బు అంతే అని కొంత మంది ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. కొన్ని తప్ప..సచివాలయంలోని భవనాలు చాలా వాటికి ఇంకా తక్కువలో తక్కువ 50 నుంచి 60 సంవత్సరాలు మన్నికగా ఉంటాయని..ఏపీ కూడా తన భవనాలు తెలంగాణకు అప్పగించినందున ఎంతో సౌలభ్యంగా వాటిని వాడుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ సర్కారు మాత్రం పాత భవనాలు కూలగొట్టి..కొత్తవి కట్టాల్సిందే అని నిర్ణయానికి వచ్చింది. కెసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రకరకాల వరాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు తప్ప ఆయన పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేసిందేమీ లేదని..అందుకే ఆయన ఓ 500 కోట్ల రూపాయల వ్యయంతో వందేళ్ళు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త భవనాల డిజైన్ చేశారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సచివాలయంలోని ఉద్యోగుల్లో కూడా ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ సాగుతోంది. కెసీఆర్ నిర్ణయించుకున్నట్లు ఏడాది..ఏడాదిన్నరలో కొత్త అసెంబ్లీ, సచివాలయం పూర్తయితే వీటిని ఎవరు కట్టించారు అంటే ఎవరైనా సరే కెసీఆర్ అని చెప్పాల్సిందే. కెసీఆర్ అదే కోరుకుంటున్నారని..అందుకే ఈ విషయంలో విమర్శలను ఆయన ఏ మాత్రం పట్టించుకోవటంలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణ ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. అయినా సరే ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం తాను అనుకున్నట్లు నూతన భవనాల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు.