తిరుమల దర్శనం...వెంకయ్య కొత్త ప్రతిపాదన

కోట్లాది మంది భక్తులు దర్శించుకునే తిరుమలకు సంబంధించి దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విఐపిలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల రావాలని సూచించారు. దీని వల్ల సామాన్యులకు ఎక్కువగా దేవుడిని దర్శించుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నారు. నిత్యం తరలివచ్చే విఐపిలతో తిరుమలలో సామాన్య భక్తుల ఇబ్బందులు ఎదురవటం సర్వసాధారణంగా మారిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వెంకయ్యనాయుడి ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం నాడు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకయ్యనాయుడికి మహాద్వారం వద్ద టీటీడీ ప్రధాన అర్చకులు సాదర స్వాగతం పలికారు.
శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆకలి, అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలి. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. వర్షాలు బాగా కురవాలి. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలి’ అని ఆయన అన్నారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రముఖులు శ్రీవారి దర్శనానికి రావాలని, తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉంటుందని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో లేనని, భవిష్యత్తులోనూ ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. అసమానతలు, ఘర్షణలు లేని సమాజం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.