Telugu Gateway
Politics

ఏకపక్ష తీర్పు ఇది..కెటీఆర్

ఏకపక్ష తీర్పు ఇది..కెటీఆర్
X

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. రాష్ట్రంలోని మెజారిటీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. దీంతో రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ లను టీఆర్ఎస్ ఎవరి మద్దతు అవసరం లేకుండా సొంతంగానే దక్కించుకోనుంది. ఈ ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బహుశా భారత దేశ చరిత్రలోనూ ఏ రాష్ట్రంలో ఎప్పుడూ ప్రజలు ఇంత ఏకపక్షంగా తీర్పు ఇచ్చి ఉండరని అన్నారు. ఈ ఘనత సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు కేటీఆర్ ధన్యావాదాలు తెలిపారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. డిసెంబర్ తీర్పును తలదన్నేలా పరిషత్ తీర్పు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ పాలనపై నమ్మకంతోనే ప్రజలు ఇంతటి విజయాన్ని అందించారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. వందకు వంద శాతం జడ్పీలు గెలుచుకున్నామని, ఇంతటి ఏకపక్షమైన తీర్పు ఉంటుందని అసలు అనుకోలేదన్నారు.

చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి తీర్పు రాలేదని, టీఆర్ఎస్ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయంగా పేర్కొన్నారు. పార్టీకి ఇంతటి ఘన విజయం చేకూరడానికి కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 32 జిల్లాల్లో జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకుందని కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలను తిరస్కరిస్తూ ప్రజలు తీర్పునిచ్చారని, ఆరు జిల్లాల్లో ప్రత్యర్థులు ఖాతానే తెరవలేదన్నారు. ఆరు జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేశామన్న కేటీఆర్.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ నియోజకవర్గంలో ఏడింటికి ఐదు జడ్పీటీసీలు గెలిచామని చెప్పారు. భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఐదింటిలో నాలుగు గెలిచామన్నారు. 12 జిల్లాల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. 90 శాతానికిపైగా ఎంపీపీలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఇది గెలుపు కాదు. ప్రజలు ఇచ్చిన బాధ్యత. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం’’ అని కేటీఆర్ అన్నారు.

Next Story
Share it