జనసేనకు షాక్

అసలే పరాజయం భారంతో ఉన్న జనసేనకు మరో షాక్. ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతల్లో ఒకరైన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు శనివారం నాడు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని పార్టీ అధినేతను కోరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన రావెల కిషోర్ బాబు గత ఎన్నికల్లో కేవలం 26,371 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత గెలుపొంది ఇప్పుడు ఏకంగా రాష్ట్ర హోం మంత్రి అయ్యారు.
జనసేనకు రావెల కిషోర్ బాబు రాజీనామా వెనక బలమైన కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన త్వరలోనే బిజెపిలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మాజీ ఐఆర్‌ఎస్ అధికారి అయిన రావెల 2014 ఎన్నికల్లో ప్రతిప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది, మంత్రివర్గంలో చోటు దక్కించుకుని గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.