సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటీషన్

మరోసారి తెలంగాణ సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టుకెక్కింది. ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రాంతంలో పాత భవనాలను కూల్చేసి 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త భవనాలు నిర్మించేందుకు సర్కారు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న ఈ భవన నిర్మాణ పనులకు సీఎం కెసీఆర్ శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రసుత్తం ఉన్న భవనాన్ని కూల్చేది లేదంటూ 2016లో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ వేసిందని.. ఇప్పుడు పాత భవనాన్ని కూల్చి వేసి మళ్ళీ నూతన సచివాలయం నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి, భారీ భవనాలు నిర్మించేందుకు గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నించగా పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో సచివాలయంను తరలించమని కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం శుక్రవారం పూర్తి వాదనలు వింటామని తెలిపింది. తదుపరి విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది. ప్రస్తుత సచివాలయం మొత్తం 25.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని చుట్టూ ఉన్న ఇతర భవనాలను సైతం స్వాధీనం చేసుకొని కూల్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ పిటీషన్ దాఖలు చేశారు.