Telugu Gateway
Politics

తెలంగాణలో ఆసలు ఆట ఇప్పుడే మొదలైందా?.

తెలంగాణలో ఆసలు ఆట ఇప్పుడే మొదలైందా?.
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి సరిగ్గా ఆరు నెలలు దాటిందో లేదో...అప్పుడే ఇక్కడ రాజకీయం వేడెక్కుతోంది. ఇంకా ఎన్నికలకు నాలుగున్నర సంవత్సరాల సమయం ఉంటే ఇప్పుడే ఎన్నికల వేడి ఏమిటి అంటారా?. ఎన్నికలకు సమయం చాలా ఉండొచ్చు. కానీ అసలు ఆట ఇప్పుడే మొదలైందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తొలి దఫాలో తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీని నామరూపాల్లేకుండా చేసిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ సారి మాత్రం ‘టార్గెట్ కాంగ్రెస్’ను అమలు చేశారు. ఇందులో చాలా వరకూ విజయవంతం అయ్యారనే చెప్పాలి. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలతో సిఎల్పీనే టీఆర్ఎస్ లో విలీనం అయిందని నోటిఫికేషన్ కూడా జారీ అయ్యేలా చేశారు. కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టానని సంతోషపడుతున్న టీఆర్ఎస్ అధిష్టానికి ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవనిచ్చేలా లేదు బిజెపి. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి మరింత దూకుడు చూపించబోతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు బిజెపిలో ఎక్కడలేని జోష్ పెంచాయి.

అన్నింటి కంటే ముఖ్యంగా తెలంగాణలో ఆ పార్టీ ఏకంగా నాలుగు సీట్లు దక్కించుకోవటం అత్యంత కీలకంగా మారింది. పెద్దగా దృష్టి పెట్టకపోతేనే నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి...ఇక ఫోకస్ పెడితే ఎలా ఉంటుంది అనే విషయం బిజెపికి బాగా అర్థం అయింది. గతంలో లాగా ఇప్పుడు మోడీ, కెసీఆర్ ల మధ్య సంబంధాలు అంత సాఫీగా ఉన్నట్లు కన్పించటం లేదు. అందుకే తెలంగాణ సీఎం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కెసీఆర్ ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ తోపాటు టీడీపీలో కాస్త పట్టున్న లీడర్లను తమవైపు తిప్పుకునే పనిలో బిజెపి పడింది. కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బకొట్టగలిగామని..తమకు తెలంగాణాలో ఇక బలమైన ప్రత్యర్ధులే ఉండబోరని కెసీఆర్ సంతోషిస్తున్న సమయంలో బిజెపి రూపంలో ప్రమాదం ముంచుకొస్తోందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవటంలో ఘోరంగా విఫలమైంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానంతోపాటు..స్థానిక నాయకత్వం వైఫల్యాలు కూడా ఎన్నో ఉన్నాయి.

Next Story
Share it