నెలాఖరులో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ!
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మే నెలాఖరు వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ వెళ్ళిన తర్వాత కూడా కెసీఆర్ ఈ దిశగా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. దీనికి ప్రధాన కారణాలు..కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం..పెండింగ్ లో పలు అంశాలు ఉండిపోవటం. కాళేశ్వరం ప్రారంభోత్సవం వెంటనే మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి...కెసీఆర్ తెలంగాణ సలహా మండలి వంటి అత్యున్నత నిర్ణాయక బాడీని ఏర్పాటు చేసుకుని పాలనకు ‘డైరక్షన్స్’ ఇస్తారా? లేక ఈ ప్రక్రియను మరికొంత కాలం వాయిదా వేస్తారా? అన్న దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. కెటీఆర్ కు పగ్గాలు అప్పగించేట్లు అయితే..కెసీఆర్ సారధ్యంలో అత్యున్నత సలహా మండలి ఏర్పాటు అవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనకు తాత్కాలికంగా బ్రేక్ లు వేస్తే మాత్రం కెటీఆర్ తో పాటు మరికొంత మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని చెబుతున్నారు.
అయితే ఇఫ్పుడు అందరి దృష్టి హరీష్ రావుపైనే ఉంది. ఈ విస్తరణలో అయినా హరీష్ రావుకు అవకాశం వస్తుందా?. రాదా అన్నది టీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కారణాలు ఏమైనా హరీష్ రావును కెసీఆర్ దూరం పెట్టడం వల్ల సోషల్ మీడియాతోపాటు పార్టీ వర్గాల్లోనూ విస్తృతమైన చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇది పార్టీకి మరింత నష్టం చేసే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో హరీష్ రావుకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని కొంత మంది కెసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నారని..ఈ కారణంతోనే అవసరం లేకపోయినా కెసీఆర్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో నెలకొంది. అయితే కాంగ్రెస్ నేతల చేరిక రాబోయే రోజుల్లో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని దెబ్బే తగిలిందని చెప్పకతప్పదు.
ఎందుకంటే టీఆర్ఎస్ సారు..కారు..పదహారు అంటూ...ఖచ్చితంగా అన్ని సీట్లు తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. కానీ చివరకు తొమ్మిది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటినా పార్లమెంట్ ఎన్నికలను..వీటితో సరిపోల్చలేం. నిజామాబాద్ లో ఏకంగా సిట్టింగ్ ఎంపీ, కెసీఆర్ కుమార్తె ఓటమి కూడా అధికార పార్టీకి షాక్ లాంటిదనే చెప్పాలి. ఈ తరుణంలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి మార్పు, చేర్పులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. వరస ఎన్నికల కారణంగా కొత్త ప్రభుత్వం వచ్చినా పాలన పడకేసిందనే చెప్పాలి. మళ్ళీ ఇఫ్పుడు సచివాలయాన్ని ఖాళీ చేస్తే ఇది కూడా పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందని..మరికొంత కాలం గందరగోళమే ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.