Telugu Gateway
Politics

నాడు రాళ్ళు వేశారు..నేడు రా రమ్మని పిలుస్తున్నారు!

నాడు రాళ్ళు వేశారు..నేడు రా రమ్మని పిలుస్తున్నారు!
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎందుకింత అప్యాయత..అనురాగం చూపిస్తున్నారు. ఒకప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టడానికి వీల్లేదని..మానుకోటలో ఓదార్పు యాత్రకు వెళితే రాళ్ళు వేయించిన టీఆర్ఎస్ ఇప్పుడు జగన్ ను రా...రమ్మని ఎందుకింత ఆత్రంగా ఆహ్వానిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండటాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ ఒక్క మానుకోట విషయంలోనే కాదు...జగన్ పై టీఆర్ఎస్ అగ్రనేతలు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో జగన్ తలపెట్టింది కేవలం ఓ యాత్ర మాత్రమే. అయినా సరే అసలు అడుగుపెట్టడానికే వీల్లేదన్నారు. 2004 డిసెంబర్ లో జగన్ మానుకోట పర్యటనకు బయలుదేరితే రైల్వే ట్రాక్ వెంట అంతా హంగామా చేయటంతోపాటు..మానుకోట రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున రాళ్ళ దాడికి పాల్పడ్డారు.

ఇప్పుడు ఆ వ్యతిరేకత ఎక్కడికి పోయింది. సీన్ కట్ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పుడు పదే పదే అమరావతి వెళ్ళి జగన్ ఆతిధ్యం స్వీకరిస్తున్నారు. జగన్ తన ప్రమాణ స్వీకారానికి కెసీఆర్ ను ఆహ్వానించారు. ఆయన వెళ్ళారు..జగన్ ఇంట్లోనే ఆతిధ్యం స్వీకరించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను ఆహ్వానించాలని ఎందుకంత పట్టుదలగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇదే జగన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా విమర్శలు కూడా చేశారు. కెసీఆర్ ఏపీ ప్రయోజనాలు విస్మరించి తెలంగాణలో అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. మరి ఇఫ్పుడు జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తారా?. వస్తే గతంలో ఆయన చేసిన విమర్శలను వెనక్కి తీసుకున్నట్లేనా?. అన్న సందేహం రావటం ఖాయం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కెసీఆర్ ప్రత్యేక ప్రేమకు కారణాలు ఏంటి? అంటే పూర్తిగా రాజకీయ కోణంలోనే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా విన్పిస్తోంది.

దీర్ఘకాలిక వ్యూహాల అమలులో భాగంగానే ఈ కసరత్తును కెసీఆర్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా తెలంగాణలో అత్యంత బలమైన సామాజికవర్గానికి చెందిన కీలక నేతలు అందరినీ కెసీఆర్ తన వైపు తిప్పుకోగలిగారు. జగన్ తో ఈ స్నేహబంధం ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో అది తమకు ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుందనేది కెసీఆర్ ఆలోచనగా ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ కథ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో బిజెపి జూలు విదుల్చుతుండటంతో కెసీఆర్ అప్రమత్తం అయ్యారని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి నిజంగా కెసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తారా? లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it