జనసేన తరపున పత్రిక

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం ఓ పక్షపత్రికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాల ఖరారుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ భావజాలం, ప్రణాళికలు, నిర్ణయాలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిచేసే విధంగా కథనాలు ఉండాలని పేర్కొన్నారు. మేధావులు, అభిప్రాయలు వెల్లడించడానికి ఈ పత్రిక ఒక వేదిక కావాలని పవన్ ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పక్ష పత్రిక తోడ్పాటు అందించాలన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటు వేసిన వారికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలిపింది. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన గురువారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు.
భవిష్యత్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పార్టీ కోసం పనిచేసేవారందరూ ఒకే తాటిపైకి రావాలని ఉద్బోధించారు. ఈ ఎన్నికల్లో ఓటమిని అనుభవంగా తీసుకోవాలని, పార్టీ నేతలు స్వీయ విశ్లేషణ చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీని త్వరలో పునర్నియామకం చేయనున్నట్టు వెల్లడించారు. తన తుదిశ్వాస వరకు పార్టీని ముందుకు తీసుకువెళ్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనం ఒక్కోసారి ఊహించని ఫలితాలు చూడవలసి ఉంటుంది. దానిని ఎదుర్కోవాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక, ముందు చూపు అవసరమన్నారు. తాను గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ సమయాభావం వల్ల ఏ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయానని అన్నారు.