Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో బాక్సైట్ తవ్వకాలకు జగన్ నో

ఏపీలో బాక్సైట్ తవ్వకాలకు జగన్ నో
X

బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించే ప్రసక్తేలేదన్నారు. వాస్తవానికి వైఎస్ హయాంలోనే అన్ రాక్, జిందాల్ సంస్థలతో ఎపీఎండీసీ ద్వారా బాక్సైట్ సరఫరాకు ఒప్పందాలు జరిగాయి. అన్ రాక్ అయితే ఏకంగా అల్యూమినియం తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేసింది. చంద్రబాబు సర్కారు ప్రతిపక్షంలో ఉండగా..బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించి..అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు ఇఛ్చారు. ఇది వివాదస్పదం కావటంతో మళ్ళీ వెనక్కి తగ్గారు. జగన్ మాత్రం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తవ్వకాలు జరపడం సరికాదన్నారు. బాక్సైట్‌ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇక నుంచి ఏజెన్సీలో మైనింగ్‌ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఎస్పీలతో సమావేశం అయిన సమయంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీఎం ఆరా తీశారు. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తామని అనేక సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నెలకోసారి తప్పనిసరి పర్యటించాలని సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా రీత్యా... అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒకేసారి ఆయా ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రజలందరికీ ప్రభుత్వం సేవలు అందుతున్నాయా.? లేదా అన్నదానిపై సమీక్ష నిర్వహించాలన్నారు. గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి అభిమానాన్ని పొందాలని సీఎం ఆదేశించారు.

Next Story
Share it