‘ప్రత్యేక హోదా’పై వాదన గట్టిగా విన్పించాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు జరిపిన ఆర్థిక శాఖ సమీక్షంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయటంతోపాటు..అవసరం అయితే ప్రభుత్వమే మద్యం విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ తన వాదన వినిపించాలి . రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను వివరిస్తూ సమగ్రమైన నివేదిక తయారు చేసి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలి. సామాన్యునిపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాలి. హరిత పన్ను (గ్రీన్ టాక్స్), వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరైన ఇసుక విధానం అమలు ... వంటి చర్యలు ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలి.’ అని సూచించారు. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ పెట్టి, అప్పులు తీసుకుని, వాటిని దారి మళ్లించిన వైనాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎక్సైజ్ శాఖను కేవలం ప్రత్యేక ఆదాయ వనరుగా చూడకూడదు ...ప్రతి పేద వారి లో ఆనందం వెల్లివిరిసేందుకు బెల్ట్ షాపులను సమూలంగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడయినా బెల్ట్ షాప్ కనిపిస్తే.. దానిపై చర్యలు తీసుకుంటూనే, దానికి మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ లైసెన్స్ రద్దు చెయ్యాలని ఆదేశించిన సీఎం వై ఎస్ జగన్. ఎక్కడ అక్రమాలు జరిగినా మరింత కఠినతరమైన నిబంధనలు అమలు చేయాలి . దశల వారి మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. కుదేలైన ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు ఆర్ధిక క్రమశిక్షణ అందరు పాటించాలని సూచించారు.