Telugu Gateway
Telangana

కెసీఆర్..జగన్ కీలక భేటీ

కెసీఆర్..జగన్ కీలక భేటీ
X

రంజాన్ పురస్కరించుకుని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిల మధ్య కీలక భేటీకి వేదిక అయింది. గవర్నర్ సమక్షంలోనే ఈ సమావేశం సాగింది. ముఖ్యంగా వీరిద్దరూ అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను సాధ్యమైనంత వరకూ కేంద్రం జోక్యం లేకుండానే పరిష్కరించుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో హైదరాబాద్ లో జగన్ తనకు నచ్చిన భవనాన్ని క్యాంప్ ఆఫీస్ గా చేసుకోవచ్చని కెసీఆర్ తెలిపారు. ఏపీ కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కెసీఆర్ లు సఖ్యతతోనే ఉంటున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన కెసీఆర్ ఎలాంటి విభేదాలు లేకుండా కలసి ముందుకు సాగుదామని..నీటిని కూడా సద్వినియోగం చేసుకుందామని బహిరంగంగానే ప్రకటించారు. విభజన వివాదాల పరిష్కారం కోసం త్వరలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నాడు నిర్ణయించుకున్నారు.

రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంకా కొలిక్కి రాని వివాదాలకు సత్వర ముగింపు పలకాలని అభిప్రాయానికి వచ్చారు. ఇద్దరు సీఎంలు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల విభజనతోపాటు విద్యుత్‌ ఉద్యోగుల విభజన, విద్యుత్‌ సంస్థల మధ్య విద్యుత్‌ బిల్లులు, ఆస్తులు, అప్పుల పంపకాలు, ఏపీ భవన్‌ విభజన తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచినా ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశాలను ఉభయ ప్రయోజనకరంగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం.

Next Story
Share it