Telugu Gateway
Politics

కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు పాత్రే లేదా?!

కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు పాత్రే లేదా?!
X

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు మాజీ మంత్రి హరీష్ రావు పాత్రే లేదా?. సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాత్రి..పగలూ తేడా లేకుండా కష్టపడ్డారు. నిత్యం ప్రాజెక్టు సైట్ ను పర్యవేక్షిస్తూ..సమీక్షా సమావేశాలతో పనులను పరుగులు పెట్టించటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సాక్ష్యాత్తూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ ప్రాజెక్టును సందర్శించిన సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖర్ రావుగా, హరీష్ రావును కాళేశ్వరరావుగా పిలిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కానీ మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడిన సీఎం కెసీఆర్ మాటమాత్రంగా అయినా హరీష్ రావు పేరు ప్రస్తావించలేదు. అంతే కాదు..‘ కాళేశ్వరం సాధకుడిని నేనే. నిర్మాణానికి ఆహోరాత్రులు శ్రమించాను’ అని ప్రకటించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టు ను పరుగులు పెట్టించటంలో కెసీఆర్ కృషిని ఎవరూ కాదనరు కాదనలేరు. కానీ అదే క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో దగ్గరుండి ఎంతో కష్టపడిన మాజీ మంత్రి, సొంత మేనల్లుడు హరీష్ రావును కనీసం మాట మాత్రంగా అయినా ప్రస్తావించకుండా పూర్తిగా విస్మరించటంపై టీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది.

ముందస్తు ఎన్నికల తర్వాత కెటీఆర్ తోపాటు హరీష్ రావులను కెసీఆర్ మంత్రివర్గంలోకే తీసుకోలేదు. ప్రస్తుతం సాగునీటి శాఖ కెసీఆర్ వద్దే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల21న జరగనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మాజీ మంత్రిగా హరీష్ రావుకు కనీసం ఆహ్వానం అయినా అందుతుందా?లేదా అన్నది సందేహమే అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను బాధ్యతను మంత్రి ఈటెల రాజేందర్ కు అప్పగించారు కెసీఆర్. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలను స్వయంగా వెళ్లి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

Next Story
Share it