Telugu Gateway
Andhra Pradesh

లోకేష్ మెడకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్..ఫిన్ టెక్ వ్యాలీ నిర్ణయాలు!

లోకేష్ మెడకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్..ఫిన్ టెక్ వ్యాలీ నిర్ణయాలు!
X

మాజీ మంత్రి నారా లోకేష్ చిక్కుల్లో పడనున్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి ఐటి శాఖ వర్గాలు. నారా లోకేష్ ఐటి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాలు అన్నీ ఇప్పుడు సమీక్షకు రానున్నాయి. వైజాగ్ లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ కోరిన దాని కంటే ఎక్కువ భూమి ఇవ్వటంతోపాటు... రాష్ట్ర పరిపాలనకు మార్గదర్శి వంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఫారసులను కూడా పట్టించుకోకుండా మంత్రివర్గం అడ్డగోలుగా ఈ కంపెనీకి భూ కేటాయింపు విషయంలో నిర్ణయం తీసుకుంది. ఈ ఫైలు తీస్తే అక్రమాలు అన్నీ వెలుగులోకి రావటం ఖాయం అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదొక్కటే కాదు..వైజాగ్ లో ఫిన్ టెక్ వ్యాలీ పేరుతో ఐటి శాఖ పెట్టిన ఖర్చు కూడా కళ్ళు తిరిగేలా ఉందని..పెట్టిన ఖర్చుకు అక్కడ వాస్తవ ప్రగతికి ఏ మాత్రం పొంతన ఉండదని ఐటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫిన్ టెక్ వ్యాలీ పేరుతో సదస్సులు...సమావేశాలు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీంతోపాటు విశాఖపట్నంలో నిర్మించిన ఐటి టవర్ల అంచాలను కూడా అడ్డగోలుగా పెంచి దోపిడీ చేశారని ఆ శాఖ వర్గాలే ఆరోపిస్తున్నాయి. దీంతో పాటు పలు ఐటి కంపెనీలకు ‘ప్రత్యేక రాయితీలు’ ఇవ్వటం ఒకెత్తు అయితే...భూ కేటాయింపుల అంశం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన మంత్రివర్గ సబ్ కమిటీ పరిశీలించనుంది.

అంతే కాకుండా అర్హత లేని పలు కంపెనీలకు కూడా అడ్డగోలుగా రాయితీలు..ప్రోత్సాహకాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అస్మదీయ కంపెనీలకు మేలు చేకూర్చిపెట్టినట్లు చెబుతున్నారు. ఐటి శాఖ నిర్ణయాలు ఖచ్చితంగా లోకేష్ మెడకు చుట్టుకోవటం ఖాయం అని ఐటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరో వైపు ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లు ఇలా ఒకేసారి మంత్రివర్గ ఉపసంఘం విచారణలో ‘చిక్కుకునే’ అవకాశాలు ఉన్నాయని...ఇది రాబోయే రోజుల్లో టీడీపీకి కష్టకాలమే అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it