అమరావతిపై సీబీఐ విచారణ!
అమరావతి అక్రమాల పుట్ట బద్దలు కాబోతుందా?. భూ గోల్ మాల్ దగ్గర నుంచి అమరావతిలో జరిగిన అక్రమాలు అన్నీ వెలుగులోకి రానున్నాయా? సింగపూర్ కంపెనీల స్విస్ ఛాలెంజ్ దోపిడీ డిజైన్ అసలు రంగు కూడా బహిర్గతం అవుతుందా? అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. సీఆర్ డీఏ ఛైర్మన్ అవుతారని ప్రచారం జరుగుతున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్విస్ ఛాలెంజ్‌పై అవసరమైతే లండన్ కోర్టుకైనా వెళ్తామన్నారు. ఈ మోడల్ ను వైసీపీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించింది. వేల ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడంతోపాటు..మౌలికసదుపాయాల కల్పన కోసం కూడా సర్కారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయినా సరే సర్కారుకు అతి తక్కువ వాటా..సింగపూర్ కంపెనీలకు మెజారిటీ వాటాలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. అమరావతి వ్యవహారంలో అవసరం అయితే సీబీఐ విచారణ కూడా కోరతామని రామక్రిష్ణారెడ్డి ప్రకటించారు. రాజధానిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామన్నారు.
అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హాయాంలో రాజధాని అమరావతిలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. చదరపు అడుగుకు రూ.2 వేలు కూడా ఖర్చు కాని తాత్కాలిక సచివాలయానికి రూ.10 వేలకు పైగా ఖర్చు పెట్టి వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. రాజధాని ఇక్కడ ఉండదని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబుకి రాజధాని మీద ప్రేమ ఉంటే ఇక్కడే ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. రాజధానిలో అందరికీ అండగా ఉంటామని ధీమా ఇచ్చారు. త్వరలోనే ఎమ్మెల్యే ఆర్కే, తాను కలిసి సీఆర్డీఏ కమిషనర్‌ను కలిసి రాజధానిలో పరిస్థితులు వివరిస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలోని రైతలతో సమావేశం అయిన సమావేశంలో వీరు ఈ వ్యాఖ్యలు చేశారు.