స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంగా తొలి పర్యటన కోసం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. పూర్ణకుంభంతో వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్ జగన్ స్వరూపానందేంద్ర స్వామి వారికి కానుకలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. జగన్ వెంట వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురాంతో పాటు మరో 7గురు వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చినముషిడివాడ శారదా పీఠం వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 14 కిలోమీటర్లు అడుగడుగునా పోలీసుల పహారా నెలకొని ఉంది. శారదా పీఠం పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.