Telugu Gateway
Andhra Pradesh

ఆంధ్రజ్యోతి అక్రమ నిర్మాణంపై జగన్ సర్కారు నోటీసులు

ఆంధ్రజ్యోతి అక్రమ నిర్మాణంపై జగన్ సర్కారు నోటీసులు
X

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ నిర్మాణాల వ్యవహారం ఇప్పుడు పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ప్రారంభం అయిన ఈ వ్యవహారం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితోపాటు మరో 28 నివాసాలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఒక్క అమరావతిలోనే కాదు..వైజాగ్ తోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా ఇదే డ్రైవ్ నడుస్తోంది. అందులో భాగంగా ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తాజాగా జారీ చేసిన నోటీసులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్‌ కార్యాలయాన్ని నిర్మించిన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీ చేశారు.

నోటీసు అందిన ఏడు రోజుల్లోగా స్పందించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్‌ ఆర్డర్‌ జారీ చేశారు. జిల్లాలోని పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 208/5ఎలో ప్రింటింగ్‌ ప్రెస్‌ భవన నిర్మాణాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం గతేడాది 1.75 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభం కూడా చేసింది. ప్రస్తుతం ఇక్కడి నుంచే పత్రికా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే, దీని నిర్మాణం కోసం డిస్ట్రిక్ట్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అధికారుల నుంచి గానీ, ‘గుడా’ నుంచిగానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించలేదు.

Next Story
Share it