Telugu Gateway
Telangana

తెలంగాణ టెన్త్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా ఫస్ట్

తెలంగాణ టెన్త్ ఫలితాల్లో జగిత్యాల  జిల్లా ఫస్ట్
X

తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా ప్రధమ స్థానంలో నిలవగా..హైదరాబాద్ చివరి స్థానాన్ని దక్కించుకుంది. సోమవారం ఉదయం 11.30 గం.కు సచివాలయం డి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పదవి తరగతి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటిలాగానే ఈ ఫలితాల్లో అమ్మాయిలే ముందు వరసలో ఉన్నారు. పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వగా 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.18 శాతంగా నమోదైంది. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల(99.30 శాతం) మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్(89.09 శాతం) చివరి స్థానంలో నిలిచింది. పాఠశాలలు, విద్యార్థులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను www. bse.telangana. gov. in వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

ప్లే స్టోర్‌ నుంచి కూడా టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు అని టైప్‌ చేసి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్‌ కావాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యాక అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్‌ వస్తాయి. అలాగే విద్యార్థులు తమ మొబైల్‌ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి. మెయిల్‌ ఐడీని నమోదు చేసి సేవ్‌ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్సెస్‌లోకి వెళ్లి దానిని సెలెక్ట్‌ చేసి, టెక్ట్స్‌ బాక్స్‌ లో ఫిర్యాదు రాసి సబ్ మిట్‌ చేయాలి. ఆ తరువాత కన్‌ఫర్మేషన్‌ మేసేజ్‌ విద్యార్థుల మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. అయితే ఇందులో ఒక్కసారే ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుంది. తెలుగు మీడియం కంటే ఇంగ్లీషు మీడియాలోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. గత ఏడాది కంటే ఉత్తీర్ణత 8 శాతం మేర పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాఠశాల్లో జీరో శాతం ఫలితాలు వచ్చాయి. జూన్ 10 నుంచి 24 వరకూ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. మే 29 వరకూ ఫీజు కట్టే వెసులుబాటు ఉంటుంది.

Next Story
Share it