Telugu Gateway
Telangana

ఇంటర్ బోర్డు..గ్లోబరీనాది ఫెవికాల్ బంధమా?

ఇంటర్ బోర్డు..గ్లోబరీనాది ఫెవికాల్ బంధమా?
X

లక్షలాది మంది విద్యార్ధుల ఫలితాలు, జీవితాలతో ఆడుకున్న సంస్థకే ఇంటర్ బోర్డు మళ్ళీ రీ వెరిఫికేషన్ బాధ్యతలు అప్పగించటం అంటే ఏమి సంకేతం పంపుతున్నట్లు?. అసలు ఆ సంస్థతో ఒప్పందమే లేదన్నారు. అయినా సరే ఫలితాలు ప్రాసెస్ చేసింది. ప్రధానంగా ఆ సంస్థపైనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఆ సంస్థకు అర్హతే లేదన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంటర్ బోర్డు గ్లోబరీనా సంస్థ రీ వెరిఫికేషన్ తోపాటు ఫలితాల ప్రాసెసింగ్ ప్రక్రియలో పాల్గొంటుందని ఇంటర్ బోర్డు ప్రకటించటం కలకలం రేపుతోంది. ఈ సంస్థతో పాటు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్ టీఎస్) మరో స్వతంత్ర సంస్థతో ఈ పనులు చేయించుతుందని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇన్ని తప్పులు చేసిన గ్లోబరీనా ఎందుకు?. త్రిసభ్య కమిటీ బాధ్యత ఎక్కడ లోపాలు జరిగాయో తెలుసుకోవటమా?. లేక గ్లోబరీనా కొనసాగించాలని చెప్పటమా?. తప్పులు ఎవరు చేశారో త్రిసభ్య కమిటీ స్పష్టంగా చెప్పింది.. అయినా సరే ఇంటర్ బోర్డు మళ్ళీ అదే సంస్థను పట్టుకుని వేలాడటం వెనక మతలబు ఏమిటి?.

ఇంటర్ బోర్డుతో ఆ సంస్థకు ఫెవికాల్ సంబంధం ఉందా? లేక ప్రభుత్వంలోని పెద్దలతో ఆ సంస్థకు అంత బలమైన బంధం పెనవేసుకుపోయిందా?. ఎవరైనా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారు. కానీ ఇంటర్ బోర్డు మాత్రం అదేమీ పట్టనట్లు తప్పు చేసిన సంస్థకే మళ్ళీ బాధ్యతలు అప్పగించటం అంటే ఏంటి?. అసలు ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న తప్పులపై ఆందోళన చెందుతున్న విద్యార్ధులకు సర్కారు ఎలాంటి సంకేతం పంపదలచుకుంది తాజా నిర్ణయంతో.

ఓ వైపు ప్రతిపక్షాలు ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. కానీ సర్కారు ఇదేమి పట్టించుకోకుండా మళ్ళీ గ్లోబరీనా సంస్థకే ఈ పనులు అప్పగిస్తే విద్యార్ధులు..వారి తల్లిదండ్రుల్లో నమ్మకం పెరగుతుందా?. ఎందుకు సర్కారు ఇంత మొండిగా వ్యవహరిస్తుంది. ఇది సర్కారుకు ఏమైనా మేలు చేస్తుందా?. ఇంటర్ బోర్డు తాజా నిర్ణయంపై అధికార వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిజంగా గ్లోబరీనా సంస్థతో అసలు ఒఫ్పందమే చేసుకోనప్పుడు ఎందుకు ఇంటర్ బోర్డు ఆ సంస్థను పట్టుకుని వేలాడుతుంది?. అంటే దీని వెనక ఏవో బలమైన కారణాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజా పరిణామంపై విద్యార్ధులు..వారి తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it