మమతకు క్షమాపణ చెప్పను
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోటో మార్పింగ్ కు సంబంధించి తాను ఆమెకు క్షమాపణ చెప్పే ప్రసక్తిలేదని బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర‍్మ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదలైన ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీని ట్రోల్ చేసినందుకు మమతాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జైలులో తనపట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. తాను బీజేపీ కార్యకర్తను కాబట్టే టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు.
తనతో అధికారులు బలవంతంగా క్షమాపణ చెప్పించేందుకు యత్నించారని ఆమె ఆరోపించారు. సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసినా, అధికారులు మాత్రం తనను బుధవారం విడుదల చేశారని ఆమె అన్నారు. తన కుటుంబసభ్యులతో పాటు న్యాయవాదిని కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ప్రియాంక శర్మ ఆరోపణలు చేశారు. తనపై పెట్టిన కేసుపై పోరాటం చేస్తానని ఆమె తెలిపారు.