Telugu Gateway
Telangana

రవిప్రకాష్ కోసం గాలిస్తున్న పోలీసులు!

రవిప్రకాష్ కోసం గాలిస్తున్న పోలీసులు!
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అజ్ణాతంలో ఉన్నారా?. అంటే ఔననే చెబుతున్నారు పోలీసులు. ఆయన కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. రవిప్రకాష్ సెల్ ఫోన్లు స్విచాఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని పోలీసులు చెబుతున్నారు. రవిప్రకాష్ పై పోలీసులు ఇఫ్పటికే ఫోర్జరీతో పాటు డేటా చోరీ వంటి కేసులు నమోదు చేశారు. విచారణకు తమ ముందు హాజరుకావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేయగా..దానికి రవిప్రకాష్ తరపు లాయర్ పది రోజుల సమయం కోరారు. అయితే ఈ కేసు ఎంతో కీలకమైనందున అంత సమయం ఇవ్వలేమని..వెంటనే హాజరుకావాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు.

టీవీ9 యాజమాన్య మార్పిడి సమయంలో కొత్త డైరక్టర్లకు రవిప్రకాష్ పలు అడ్డంకులు సృష్టించారని అలంద మీడియా ప్రతినిధులు బహిరంగంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు రవిప్రకాష్ తన స్నేహితుడు, నటుడు శివాజీతో కలసి ఎన్ సీఎల్ టీలో కేసు వేయించారని చెబుతున్నారు. 90.50 శాతం వరకూ వాటా ఉన్న కంపెనీ ప్రతినిధులను కాదని..మైనారిటీ వాటాదారుడైన రవిప్రకాష్ పలు అడ్డంకులు సృష్టించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు అలంద మీడియా టీవీ9 యాజమాన్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని రవిప్రకాష్ తోపాటు మరికొంత మందిపై వేటు వేసింది. అదే సమయంలో కొత్త సీఈవో..సీవోవోను నియమించింది.

Next Story
Share it