Telugu Gateway
Politics

‘రాడార్’కు చిక్కిన మోడీ!

‘రాడార్’కు చిక్కిన మోడీ!
X

ఐదేళ్లు. ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం లేదు. ఒకప్పుడు ‘పప్పు’గా పిలవబడిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి..ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్నింటికి సమాధానం చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ ప్రధాని లేనంత ‘శక్తివంతమైన’ ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీకి ఎందుకీ పరిస్థితి?. అంతా మేనేజ్డ్ షోనేనా?. తాజాగా ఓ ఇంటర్వూలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇంత కాలం మోడీ మీడియా ముఖం చాటేయటానికి కూడా కారణం ఇదేనా?. మోడీ విషయ పరిజ్ణానం అంతేనా? అన్న చర్చ సాగుతోంది. మోడీ సర్కారు అతి పెద్ద విజయంగా చెప్పుకుంటున్న బాలాకోట్ దాడులకు సంబంధించి మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. చివరకు బిజెపి ఐటి విభాగం కూడా ఆయన చేసిన వ్యాఖ్యల ట్వీట్ ను డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

‘దట్టమైన మబ్బులు ఉన్నప్పుడే పని పూర్తి చేయండి. మబ్బుల చాటున ప్రయాణించటం ద్వారా పాక్ రాడార్ల నుంచి తప్పించుకోవచ్చని వాయుసేనకు సలహా ఇఛ్చా’ అని మోడీ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. అంతే సోషల్ మీడియాతోపాటు..విపక్షాలు కూడా మోడీపై ఎటాక్ ప్రారంభించాయి. వాస్తవానికి ఎంత ప్రతికూల వాతావరణంలో అయినా రాడార్లు పనిచేస్తాయి. నిజానికి మోడీకే కాదు..ఏ ప్రధానికి అయినా సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయి అవగాహన ఉండదు. అది తప్పేమీ కాదు కూడా. కానీ నరేంద్రమోడీ తనకు అన్నీ తెలిసినట్లే మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ దెబ్బతో ‘రాడార్ కు చిక్కారు’. అక్కడే చిక్కు వచ్చి పడింది.

సాంకేతిక అంశాలపై మాట్లాడే సమయంలో ప్రధానితోపాటు ఇతర ముఖ్యులు ఎవరైనా సంబంధిత శాఖల అధికారుల నుంచి బ్రీఫింగ్ తీసుకుంటారు. కానీ మోడీ మాత్రం మేఘాలు..రాడార్ పై మాట్లాడి చివరి విడత ఎన్నికల ముందు వివాదంలో చిక్కుకున్నారు. మోడీపై సోషల్ మీడియా ఎటాక్ ఎంతలా ఉందంటే దాడులు జరిగిన రోజు యుద్ధ విమానాలు నడిపిన వారిలో తాను కూడా ఒకరిని అని మోడీ చెప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. సింగర్, కంపొజర్ అయిన విషాల్ దాడ్లాని కూడా మోడీ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు. ‘ సైన్స్ అనేది నిజం. భారత్ ను ఇబ్బందిపడేలా చేయకండి.ఫలితాలు వెల్లడయ్యే వరకైనా మీరే ప్రధాని. మీరు ఏదైనా మాట్లాడేముందు అర్హులైన వారితో చర్చించండి’ అని వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్ళ కాలంలో మోడీ ఇంతగా చిక్కుల్లో పడిన సందర్భం ఇదేనేమో.

Next Story
Share it