Telugu Gateway
Politics

వార్తలు చెప్పాల్సిన మీడియానే ‘వార్తల్లో’!

వార్తలు చెప్పాల్సిన మీడియానే ‘వార్తల్లో’!
X

ప్రజలకు సమాచారం చేరవేయాల్సిన మీడియానే ఇప్పుడు ‘వార్తల’కు ముడిసరుకుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు మీడియా రంగంలో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ఏదైనా..అధికారంలో ఎవరున్నా నిజానికి మీడియాకు సంబంధం ఉండకూడదు. అయితే ఆ ట్రెండ్ ఎప్పుడో పోయింది. అధికారంలో ఉన్నది అస్మదీయులు అయితే ఒక రకంగా...తస్మదీయులు అయితే మరో రకంగా మీడియా నడవటం పరిపాటిగా మారింది. చాలా కాలం నుంచే ‘సైడ్స్’ తీసుకోవటం ఉన్నా..గత పదిహేను..పది సంవత్సరాలుగా ఈ ట్రెండ్ మరింత దారుణంగా దిగజారింది. అంత ఎందుకు?. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఓ మీడియా సంస్థతో కలసి మెలసి ఉంటే..అదే ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు..కుంభకోణాలు చోటుచేసుకున్నా అవేమీ ఆ పత్రికలకు..ఛానళ్ళకు కన్పించవు. ప్రభుత్వ పెద్దలకు..పత్రికా, ఛానల్ పెద్దలకు తేడా వస్తే మాత్రం అప్పుడు మాత్రమే అసలైన జర్నలిజం మేల్కొంటుంది. ఛానళ్ల తీరు కూడా దీనికి భిన్నం ఏమీ కాదు. తెలంగాణతో పాటు...ఏపీలోనూ అదే ట్రెండ్. తెలంగాణలో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఇక్కడ పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. కానీ ఏపీలో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్నో మీడియా సంస్థలు ‘టెన్షన్’లో ఉన్నాయి.

ఒకప్పుడు రాజకీయ నేతలు కూడా మీడియాతో వివాదాలు పెట్టుకోవటానికి సాహసించేవారు కాదు. ఇప్పుడు అదేమీ లేదు. నేరుగా పత్రికలు..ఛానళ్ళ పేర్లు పెట్టి మరీ బహిరంగంగానే టార్గెట్ చేస్తున్నారు. అందుకు ఆయా ఛానళ్ళ వైఖరి కూడా కొంత కారణమే అని చెప్పకతప్పదు. ఏపీ ఫలితాలు పలు మీడియా సంస్థలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలోకి వస్తే కొంత మందికి షాక్ తప్పదు. అదే టీడీపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటే కొంత మంది షాక్. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పలు మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. పలు ఛానళ్ళు చేతులు మారటం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న పలు అగ్రశ్రేణి మీడియా ఛానళ్ళు అన్నీ ప్రస్తుతం ‘కార్పొరేట్ సంస్థ’ల చేతుల్లోకి వెళుతున్నాయి. ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో మీడియాలో ఎన్ని మార్పులు వస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it