Telugu Gateway
Telangana

రవిప్రకాష్..శివాజీలకు పోలీసుల షాక్

రవిప్రకాష్..శివాజీలకు పోలీసుల షాక్
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కున్న ఆయన పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రవిప్రకాష్, శివాజీలపై సైబరాబాద్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్‌తో పాటు సినీ నటుడు గరుడ పురాణం శివాజీలకు కూడా నిన్న అర్థరాత్రి సమయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. వీరిరువురు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే రవిప్రకాశ్‌ పాస్‌పోర్టును పోలీసులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా...వారు గైర్హాజరు అయ్యారు. దీంతో వాళ్లకు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో రవిప్రకాశ్‌, శివాజీలను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉంది,

టీవీ9లో వీరు చేసిన అక్రమాలు, తప్పుడు అగ్రిమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తప్పుదోవ పట్టించటం, నిధులు మళ్లింపు, టీవీ9 లోగోను విక్రయించాలనే దురాలోచన... ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. 2018 ఫిబ్రవరిలో నటుడు శివాజీ, రవి ప్రకాష్‌, శక్తి, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిషణ్ మధ్య ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన కుట్రను కూడా సైబర్ క్రైం పోలీసులు బయటపట్టారు. టీవీ9 లోగోను సైతం రూ. 99వేలకు విక్రయించటానికి తప్పుడు అగ్రిమెంట్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రవిప్రకాష్, శివాజీల చుట్టూ ఉచ్చు బలంగా బిగుస్తున్నట్లే కన్పిస్తోంది.

Next Story
Share it