Telugu Gateway
Andhra Pradesh

మద్యనిషేధం చేసే 2024లో ఓట్లు అడుగుతా

మద్యనిషేధం చేసే 2024లో ఓట్లు అడుగుతా
X

ఢిల్లీ వేదికగా ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని..అది చేసిన తర్వాతే 2024లో మళ్ళీ ఓట్లు అడుగుతామని ప్రకటించారు. ఎన్డీయే 250 సీట్ల దగ్గర ఆగిపోయే ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా ఫైలుపై సంతకం పెట్టించుకుని మద్దతు ఇచ్చేవాళ్ళమని..కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అయినా సరే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సజావుగా నడపాలంటే కేంద్ర సాయం అవసరం అని....మోడీని కలిసినప్పుడల్లా హోదా గురించి అడుగుతూనే ఉంటానని తెలిపారు. ఈ నెల30న తాను ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తానని..వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. పోలవరం టెండర్లల్లో అవినీతి జరిగి ఉంటే వాటిని రద్దు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయటమే తమ లక్ష్యమని వెల్లడించారు. అమరావతి భూసేకరణలో పెద్ద కుంభకోణం జరిగిందని..రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా టీడీపీ నేతలు పెద్ద స్కాం చేశారని ఆరోపించారు. చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ కూడా ఏకంగా 14 ఎకరాలు కొనుగోలు చేసిందని తెలిపారు. బినామీల భూములు వదిలేసి రైతుల భూములు తీసుకున్నారని విమర్శించారు.

ప్రధానితో భేటీ అనంతరం ఆదివారం ఆయన న్యూఢిల్లీలో ఏపీ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించామని, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని జగన్‌ పేర్కొన్నారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన సాయం ఆలస్యం అయిందని, వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని పరిస్థితుల్ని ప్రధానికి వివరించామన్నారు. రాష్ట్రం విడిపోయేనాటికి 97వేల కోట్ల అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో 2 లక్షల 57వేల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని జగన్‌ తెలిపారు. అప్పులపై ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావిస్తామని, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలయ్యేలా చూస్తామని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. విశ్వసనీయతకు ప్రజలు పట్టంగట్టారని, దాన్ని సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తామన్నారు. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాను. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి.

రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాల కోసం భేటీ జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు నిలుస్తామన్నారని తెలిపారు.

ఆరు నెలల్లోగా ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు చేస్తాం. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత శాఖలవారీగా సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాష్ట్రంలో అవినీతి అన్నది ఎక్కడా లేకుండా, పారదర్శక పాలన అందిస్తాం. మొత్తం వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్‌ లు రద్దు చేస్తామన‍్నారు. ఇక యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌ ను పూర్తి చేయాల్సి ఉందని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తనకు చంద్రబాబుపై వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డే వన్‌ నుంచి ఏం చేయబోతామనేది ప్రమాణస్వీకారం రోజు తెలియచేస్తామని అన్నారు.

Next Story
Share it