Telugu Gateway
Politics

చంద్రబాబు నోట గ్యాంబ్లర్ల మాట

చంద్రబాబు నోట గ్యాంబ్లర్ల  మాట
X

ఇది తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నోటి నుంచి వెలువడిన మాట. తెలుగుదేశం పార్టీ గెలుపును గ్యాంబ్లర్స్ చెపితే తప్ప చంద్రబాబునాయుడుకు తెలియదా?. ఓ వైపు పసుపు-కుంకుమ, మరో వైపు అన్నదాత సుభీవం, పెన్షన్లు ఎలా ఎన్నో తమను ఆదుకున్నాయని చెప్పిన చంద్రబాబు..చివరకు సట్టా మార్కెట్, గ్లాంబ్లర్స్ మాటలను చెబుతూ ఓ ఆడియో విడుదల చేయటం ఆసక్తికర పరిణామంగా మారింది. వైసీపీ విడుదల చేసిన ఆడియోలో చంద్రబాబు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘వాస్తవానికి దగ్గరగా ఉంటే ఆటోమేటిక్ గా ఏదైనా సాధించగలుగుతాం. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బాంబేలో సట్టా అనే ఓ మార్కెట్ గ్యాంబ్లింగ్ చేస్తుంటారు. మట్కా మాదిరిగా. నిన్న వేరే వాళ్ళు వచ్చి చెబుతున్నారు. అందులో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని. మొత్తం వాళ్ళు ఎంత కావాలంటే అంత కట్టే పరిస్థితికి వచ్చారని.’ ఇవీ చంద్రబాబు వ్యాఖ్యలు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మండిపడింది. చంద్రబాబుకు ప్రజల ఓట్లపైన నమ్మకం ఉండదు, ఈవీఎంలపై నమ్మకం ఉండదు. ఓడిపోతున్నామని తెలిసే స్థానిక ఎన్నికల వరకూ అయిన క్యాడర్ ను కాపాడుకునేందుకే ఈ తంటాలు అంటూ వైసీపీ నేత, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

చంద్రబాబు వ్యాఖ్యలు గ్యాంబ్లింగ్‌ ను ప్రోత్సహించేలా ఉందన్నారు. సీఎం హోదాలో ఉండి సట్టా మార్కెట్‌, మట్కాలపై ఎలా మాట్లాడతారంటూ విమర్శించారు. ఈ ఆడియో విన్న తర్వాత ఆయన ముఖ్యమంత్రా?. అన్న అనుమానుం కూడా వస్తుందని తెలిపారు. ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటని అన్నారు. తెలుగుదేశం పార్టీ తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని పక్కన పెట్టి బెట్టింగ్ రాయుళ్ళు పందేలా ఆధారంగా టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు చెప్పుకునే స్థితికి వచ్చారని ఎద్దేవా చేసింది. శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ముసలం మొదలైందని, ఒక గ్రూపు బైబై బాబు అంటున్నారని తెలిపారు. టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నమ్మకం సన్నగిల్లిందని అన్నారు. చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని విమర్శించారు.

Next Story
Share it