ఇంత చేశాక కూడా గెలవకపోతే అర్థమే లేదు
తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్ళ కాలంలో ఎంతో చేసిందని..అయినా ఎన్నికల్లో గెలవకపోతే దానికి అర్థమే ఉండదని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలే టీడీపీ విజయానికి కీలకం కానున్నాయని వ్యాఖ్యానించారు. వైసీపీ, బిజెపిలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికలకు సంబంధించి నివేదికలు..సర్వేలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను సోమవారం పోలవరంలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తాను పోలవరంకు వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ఆయన అన్నారు. ఎన్నికల్లో సైలెంట్ ఓటు తమకే అనుకూలమని ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో 40 మంది ఎమ్మల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనడం దేనికి సంకేతమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బెంగాల్ ప్రభుత్వాన్ని కూలగొడతామని మోదీ బెదిరిస్తున్నారా? అని అన్నారు. ఏ ప్రధాని అయినా ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారా? అని ఆయన అన్నారు.
ఎన్నికల సంఘంపై గతంలో ఎప్పుడైనా ఇన్ని విమర్శలు వచ్చాయా..?, ఆర్ బిఐ, సీబీఐ, ఈడీపై ఎప్పుడైనా ఇంతగా విమర్శలు చెలరేగాయా..? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీపైనే ఎందుకు బీజేపీ కక్షసాధిస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ సమస్యనూ మోదీ పరిష్కరించలేదని.. ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీవి చౌకబారు ప్రసంగాలు, కించపరిచే వ్యాఖ్యలని విమర్శించారు. విభజన చట్టంపై ప్రధాని, హోంమంత్రి ఒక్క సమావేశం అయినా ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ శాశ్వతంగా దోషిగా మిగిలిపోతుందని అన్నారు. ఎదుటివారిపై దాడులు చేయడం తప్ప మోదీ సాధించిందేమీ లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు. ఎగతాళి చేసేందుకే ప్రధాని మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.