చంద్రబాబు ఓటమి..మూడుసార్లు వైఎస్ ఫ్యామిలీతోనే

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఓటమికి..వైఎస్ ఫ్యామిలీకి ఓ లింక్ ఉంది. చంద్రబాబునాయుడు తన రాజకీయ కెరీర్ లో ఓటమి పాలైన ప్రతిసారి వైఎస్ ఫ్యామిలీ చేతిలోనే కావటం విశేషం. తాజా ఓటమి ఇది మూడవసారి. 2004లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాల్లో వైఎస్ చేసిన పాదయాత్ర కూడా ఒకటి. అప్పటికే చంద్రబాబుపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం..దీనికి తోడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మండుటెండల్లో వైఎస్ చేసిన పాదయాత్ర కూడా కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చింది. ఇది ఒకటి అయితే..2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఓ వైపు తెలుగుదేశం పార్టీ..మరో వైపు మీడియా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసినా కూడా రాజశేఖర్ రెడ్డి రెండవ సారి విజయం సాధించారు. తొలి దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ చేసిన సంక్షేమ కార్యక్రమాల ముందు అవినీతి ఆరోపణలు తేలిపోయాయి.
అందుకే ఎన్ని విమర్శలు..ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా వైఎస్ రెండవ సారి కూడా విజయం సాధించారు. ఇప్పుడు మూడవసారి చంద్రబాబు అత్యంత పిన్న వయస్కుడైన జగన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అది కూడా ఊహించని స్థాయిలో ఈ ఓటమి ఉండటం విశేషం. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన వారందరూ ఊహించిందే. కాకపోతే ఇంత దారుణమైన ఓటమి ఉంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. వైసీపీకి వస్తే గరిష్టంగా 130 వరకూ రావొచ్చని అంచనా వేశారు. కానీ ఈ సంఖ్య ఇఫ్పుడు 150కి దగ్గర ఉండటం విశేషం. ఇలా చంద్రబాబు తన మూడుసార్లు ఓటమి వైఎస్ ఫ్యామిలీ చేతిలోనే కావటం విశేషం.వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబు ఓటమికి కారణం అయ్యారు. వైఎస్ మరణానంతరం జగన్ సొంత పార్టీ పెట్టుకుని రెండవ సారి చంద్రబాబును ఓటమి పాలు చేశారు.