Telugu Gateway
Cinema

ఆది పినిశెట్టి కొత్త సినిమా

ఆది పినిశెట్టి కొత్త సినిమా
X

ఓ సారి విలన్. ఓ సారి హీరో. మరో సారి సెకండ్ హీరో. ఇలా పాత్ర ఏదైనా ఆది పినిశెట్టి ఏ మాత్రం వెనకాడటం లేదు. వినూత్న కథలతో..వెరైటీ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు ఈ హీరో. ఇప్పుడు కొత్తగా ఓ సినిమాకు ఓకే చెప్పేశాడు. అయితే అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఓ స్పోర్ట్స్ డ్రామాగా ఇది తెరకెక్కనుంది. గత కొంత కాలంగా టాలీవుడ్ లో స్పోర్ట్స్ కథలే ప్రధానాంశాలుగా తెరకెక్కుతున్న సినిమాలు అన్నీ హిట్ అవుతూ వస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య నటించిన మజీలీ, నాని హీరోగా నటించిన జెర్సీలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టాయి. ఇప్పుడు ఆది పినిశెట్టి అదే బాటలో పయనిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాషల్లో ఒకేసారి రూపొందించ‌నున్నారు. ద‌ర్శకుడు పృథ్వి ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

‘నేను ఈ క‌థ‌ను రాసుకుంటున్నంత సేపూ నా మ‌న‌సులో ఆది మాత్రమే మెదిలారు. ఆయ‌న‌కు క‌థ వినిపించాక‌, ఆయ‌న స‌రే చేస్తాను అని చెప్పగానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డానికి ఉత్సాహంగా ఉంది. త‌ప్పకుండా మంచి చిత్రాన్ని అందిస్తాను. అథ్లెటిక్స్‌ కు సంబంధించిన క‌థ ఇది. త‌ను క‌న్న క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి క‌థానాయ‌కుడు చేసిన ప్రయ‌త్నం ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్రస్తుతం మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం’ అని అన్నారు. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయ‌న్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్యవ‌హ‌రిస్తున్నారు.

Next Story
Share it