జగన్ ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు

ఎన్నికల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి అలా కొనసాగుతూనే ఉంది. ఓ వైపు అధికార టీడీపీ, మరో వైపు ప్రతిపక్ష వైసీపీ దూకుడు చూపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబునాయుడు తనకు జూన్ 8వ తేదీ వరకూ గడువు ఉందని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి ఓ అడుగు ముందుకేసి జగన్ ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటించేశారు. రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద బాబు పెత్తనం పోయింది. ఇది తెలిసే జూన్ 8 వరకూ నేనే సీఎం అంటున్నారు. ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. మే 26న ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి చంద్రబాబు జూన్ 8 దాకా ఎలా సీఎంగా ఉంటారు’ అని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత సీఎం రోజుకో విచిత్ర విన్యాసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం మీద ఆజన్మాంతం ఆయనకు మాత్రమే హక్కు ఉన్నట్టు ప్రవర్తిసున్నారు. ఏ కేసులో అయినా స్టేలు ఎక్కువ కాలం ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దాని నుంచి బయటపడటానికే బాబు నార్త్ టూర్ అంటున్నారు. తన ఓటమికి ఈవీఎంలను కారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయనకు ఉన్న మీడియా, ప్రచార బలం ద్వారా... ప్రజలు ఇదంతా నిజమేనేమో అనుకునే అవకాశం ఉంది. ప్రతిపక్షంగా... ప్రజలకు వివరాలు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది. 2014లో అత్తెసరు ఓట్లతో బాబు ప్రభుత్వం ఏర్పడిన విషయాన్ని అందరూ గుర్తించాలి. ఇప్పుడు కూడా ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడకుండా ఇలా.. గంగవెర్రులు ఎత్తుతున్నారు. .‘ఐదేళ్లలో రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్ ఇటుక కూడా వేయలేదు. చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే రాజధాని పూర్తయ్యేది కాదా? సీఎం సరైన సమయంలో సమీక్షలు చేయకపోవడం వల్లే పిడుగులు పడి ఏడుగురు చనిపోయారని లేఖలో రాసుకున్నారు. చంద్రబాబు రాసిన ఆ లేఖ చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. సీఎం సమీక్ష జరిగి ఉంటే ఈ మరణాలు ఆగేవని అంటున్నారు. అసలు ఏమిటిదంతా. ఈ నెల రోజుల్లో బాబు చేసిన సమీక్షలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. దోచుకోగా మిగిలినవి ఏమైనా ఉంటే కొట్టేయడానికే సమీక్షలు’ అని రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.