Telugu Gateway
Politics

ఏపీలో జగన్ దే అధికారం..సీపీఎస్ సర్వే

ఏపీలో జగన్ దే అధికారం..సీపీఎస్ సర్వే
X

వైసీపీకి 121 నుంచి 130 సీట్లు

జనసేనకు రెండు సీట్లు మించవు

హై ఓల్టేజ్ రాజకీయం ఉన్న ఏపీలో గెలుపు వైసీపీదే అని సీపీఎస్ సర్వే చెబుతోంది. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్)కు చెందిన డాక్టర్ వేణుగోపాల్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో జగన్ అధికారంలోకి రావటం పక్కా అని చెబుతోంది. ఈ వివరాలను సీనియర్ జర్నలిస్ట్ టీ ఎస్ సుధీర్ ఉమాసుధీర్. కామ్ లో ప్రచురించారు. ఏపీలో పరిస్థితిని మదింపు చేసేందుకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో సీపీఎస్ రెండుసార్లు అధ్యయనం చేసింది. ఈ వివరాల ప్రకారం వైసీపీకి 121 నుంచి 130 అసెంబ్లీ సీట్లు దక్కవచ్చు. తెలుగుదేశం పార్టీకి 45 నుంచి 54 సీట్లు రావచ్చు. జనసేనకు ఒకటి,రెండు అసెంబ్లీ సీట్లు మించి రాకపోవచ్చని తేల్చారు. లోక్ సభ సీట్లకు సంబందించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఇరవై ఒకటి, టిడిపికి నాలుగు రావచ్చు. గతసారి కన్నా తాజా సర్వేలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగిందని ఆయన తెలిపారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 48.1 శాతం ఓట్లు వస్తుంటే, టిడిపికి 40.1 శాతం ఓట్లు వస్తున్నాయని ఆయన చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేక ఎక్కువగా ఉందని, బీసీలలో చాలా మార్పు ఉందని, జగన్ కు వారిలో బాగా అనుకూలత కనిపిస్తున్నట్లు సర్వేలో తేలిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కమ్మవారికే ఎక్కువ ప్రయోజనం జరిగిందన్న భావన కూడా బలంగా ఉందని ఆయన వివరించారు. మోడీ,కెసిఆర్ లను దూషిస్తూ చంద్రబాబు తిరగడం వల్ల ప్రజలలో స్పందన లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. గతంలో పలు సర్వేలు చేసిన అనుభవం ఉన్న వేణుగోపాలరావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ కు 85సీట్లు వస్తాయని అంచనావేశారు. ఈయన మూడులక్షల మందికి పైగా తమ సర్వేలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా ఎన్నికల అంశం కాదని తమ సర్వేలో ఆయన పేర్కొన్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో 100కు జగన్ కు 90 మార్కులు వస్తే..అదే సీఎం చంద్రబాబుకు పది పాయింట్లు మాత్రమే వస్తాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించటం..అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానం చేసి తర్వాత మాట మార్చటం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారాయి. తొలుత చేసిన సర్వేలో టీడీపీ, వైసీపీ మధ్య గ్యాప్ 4.5 శాతం ఉండగా..తాజా చేసిన సర్వేలో మాత్రం అది 8 శాతానికి పెరిగింది.

చంద్రబాబు ప్రచారంలోనే డొల్లతనం కన్పిస్తోందని..సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను మళ్ళించేందుకు ఆయన మోడీ, కెసీఆర్ లవైపు ప్రచారం తిప్పారని..కానీ అవేమీ ఫలితాలు ఇవ్వటంలేదన్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు ప్రకటించిన వరాలు కూడా ఎన్నికల కోసమే అన్న అభిప్రాయం అని ఓటర్లలో ఉందని..ఇవి పెద్దగా ఫలితం ఇచ్చే అవకాశం లేదని వేణుగోపాల రావు వెల్లడించారు. జగన్ పై చంద్రబాబు చేసే అవినీతి ఆరోపణలు పెద్దగా పనిచేయటంలేదని తమ సర్వేలో తేలిందని..దీనికి ప్రధాన కారణం చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా అంతే అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. జగన్ వస్తే రౌడీరాజ్యం వస్తుందనే విమర్శలు గత ఎన్నికల సమయంలో కూడా చేశారని..ఒకే నినాదం ఎక్కువసార్లు పనిచేయదని వెల్లడించారు.

Next Story
Share it