చంద్రబాబు టార్గెట్ సీఎస్ ఎందుకు?

ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సీటుకు ఎంత విలువ ఉంటుందో...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీటుకూ అంతే విలువ ఉంటుంది. ఒకరు ప్రభుత్వానికి అధిపతి అయితే..మరొకరు పరిపాలనకు అధిపతి. ఎప్పుడూ లేనట్లు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడే సీఎస్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఒక్క చంద్రబాబే కాదు..మంత్రులు కూడా సీఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ హోం మంత్రి చినరాజప్ప అయితే సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతే కాదు..ముఖ్యమంత్రిని ఆయన ఎలా అడ్డుకుంటారని ప్రశ్నల వర్షం కురిపించారు. మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు అయితే ఏకంగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని రాజ్యాంగేతర శక్తిగా వ్యాఖ్యానించారు. అంతే కాదు ఓ అడుగు ముందుకేసి మోడీ, అమిత్ షాలు ఏమి చెపితే అదే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతే కాదు..అనిల్ చంద్ర పునాఠా నిజాయతీపరుడని..ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమించారని వ్యాఖ్యానించారు. సీఎస్ కుట్ర రాజకీయాలు మానుకోవాలని పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడూ ఓ సీఎస్ పై ఈ స్థాయిలో రాజకీయ విమర్శలు చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. కేవలం ఓటమి భయంతోనే చంద్రబాబునాయుడు అండ్ టీమ్ ఓ ఎత్తుగడగా సీఎస్ ను టార్గెట్ చేస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరైనా చేయగలిగేది ఏముంటుందని...కౌంటింగ్ కేంద్రాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఉండరా? ఏజెంట్లు ఉండరా?. ఓటమి నెపాన్ని ఈవీఎంలతో పాటు సీఎస్, ఎన్నికల కమిషన్ పై నెట్టేందుకే వ్యూహాత్మకంగా ఈ దుష్ప్రచారం ప్రారంభించారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఓ వైపు ప్రధాని నరేంద్రమోడీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శిస్తూ ..సీఎస్ సీటును అగౌరపరుస్తున్నారని అధికారులో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వ్యవస్థలను గౌరవించని వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ముందు ఉంటారని..గతంలో పునేఠా కంటే ముందు పని చేసిన సీఎస్ లు ఫైళ్లలో ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా తప్పుపడుతూ..రాష్ట్ర ఖజానాకు..ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అభ్యంతరాలు చెప్పినా కూడా చంద్రబాబునాయుడు మాత్రం అసలు మంత్రివర్గం ఉన్నదే అక్రమాల ఆమోదానికి అన్న చందంగా అధికారులు వద్దన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుకున్నారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం ఏకంగా సీఎస్ పై ఈ తరహా రాజకీయ దాడి చెడు సంప్రదాయానికి తెరతీసేదిగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.