Telugu Gateway
Politics

ఈ వంగి వంగి దండాలు ఏంటి బాబూ?!

ఈ వంగి వంగి దండాలు ఏంటి బాబూ?!
X

పాపం చంద్రబాబు. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఇలా చూసి తెలుగుదేశం హార్డ్ కోర్ అభిమానులు కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది? అని అవాక్కవుతున్నారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబునాయుడు ఎప్పుడూ లేని విధంగా ఓటర్లకు వంగి..వంగి దండాలు పెడుతున్నారు. చేసింది చెప్పుకుని..మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పి ఓటు అడగటం తప్పేమీ కాదు. కానీ ఎప్పుడూ చేయని విధంగా చంద్రబాబునాయుడు ఇలా వంగి వంగి దండాలు పెట్టడంతోనే తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది. దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఈ తరహాలో ఎందుకు వంగి దండాలు పెట్టి ఓట్లు అడగాల్సి వస్తోంది. అసలు రాష్ట్రంలో తమకూ పోటీయేలేదని ప్రకటించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అంత హైరానా పడుతున్నారు. ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించటమే కాకుండా...‘సంపద సృష్టించా’నని చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారా?. నిజంగా చంద్రబాబునాయుడు చెప్పినట్లు అంతగా సంపద సృష్టిస్తే ఎవరూ చేయని రీతిలో ఇంతగా అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది?. అంటే సంపద సృష్టి అన్నది బోగస్ అని తేలిపోతూనే ఉంది.

దేశంలోనే వ్యవసాయంలో ‘రికార్డు’ ప్రగతి అని గొప్పలు చెప్పుకుంటున్నా అవి అన్నీ కూడా డొల్ల లెక్కలే అని సాక్ష్యాత్తూ అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కోర్ అగ్రికల్చర్ లో వ్యవసాయ వృద్ధి రేటు ఏ మాత్రం లేకపోయినా ...సరైన లెక్కలు లేని చేపల పెంపకం, పాల ఉత్పత్తి వంటి వాటి లెక్కల గోల్ మాల్ తో ఎక్కడ లేని ‘ప్రగతి రేటు’ను చూపించి హంగమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే జన్మభూమి కమిటీలు రాష్ట్రం మీద పడి అడ్డగోలుగా దోచుకుంటున్న తీరును అడ్డుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు వందల కోట్లు సంపాదిస్తే అడ్డుకోకుండా లైట్ గా వదిలేసింది టీడీపీ సర్కారు కాదా?. నీరు-చెట్టు కింద ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి..అందులో సింహభాగం దోపిడీ చేసింది టీడీపీ నేతలు కాదా?. ఏపీ ప్రజలను అమరావతి పేరు మీద కలల్లో విహరింపచేసి చివరకు ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని కూడా మొదలుపెట్టలేక వైఫల్యం చెందింది చంద్రబాబే కదా?. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ స్కామ్ ల లెక్క ఓ మహాగ్రంధమే అవుతుంది. ఇవన్నీ ప్రజల గమనంలో ఉన్నాయి కాబట్టే చంద్రబాబు ఇఫ్పుడు వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు అడగాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it