Telugu Gateway
Politics

సమీక్షలకు అడ్డంకులెందుకు? సీఈసీకి చంద్రబాబు లేఖ

సమీక్షలకు అడ్డంకులెందుకు? సీఈసీకి చంద్రబాబు లేఖ
X

ముఖ్యమంత్రి హోదాలో తన సమీక్షలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి చంద్రబాబునాయుడు సుదీర్ఘ లేఖ రాశారు. అదే లేఖలో ఈసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల నిర్వహణలో కమిషన్ ఘోరంగా విపలమైందని ఆరోపించారు. తన నలబై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన వైఫల్యాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష వైసీపీ చేసిన ఫిర్యాదులపై ఆగమేఘాల మీద స్పందించిన ఈసీ..తమ ఫిర్యాదులను ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. సాదారణ పరిపాలనలో జోక్యం చేసుకోవటం, ప్రజలకు సంబంధించిన కీలక అంశాల్లో వ్యాఖ్యలు చేయటం సీఈవోకు సరికాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తాగునీరు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

సమీక్షలు నిర్వహించకపోవటం వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడుతోందని తన లేఖలో ప్రస్తావించారు. సీఎంకు అధికార పరిధిలేదంటూ సీవో వ్యాఖ్యనించినట్లు కొన్ని పత్రికల్లో వచ్చాయని..ఇవి సరికాదన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికైన చట్టబద్ధ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగించకుండా ఆదేశాలు జారీ చేయాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.లేదంటే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. లేదంటే పెరిగిపోయే వ్యయాలకు, సమయ దుర్వినియోగానికి ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సీఎం భద్రత చూస్తున్న ఇంటెలిజెన్స్‌ డీజీ, ఎస్పీ బదిలీలు ఏకపక్షమని ఆరోపించారు. బదిలీలు, ఏకపక్ష నిర్ణయాలపై స్వయంగా ఈసీఐకి తెలియజేశామని లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 11న జరిగిన పోలింగ్‌ నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని అన్నారు. దీంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారని లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it