‘జెర్సీ’పై రాజమౌళి ప్రశంసలు
హీరో నాని అంటే దర్శక దిగ్గజం రాజమౌళికి ప్రత్యేక అభిమానం. హీరోగా రాక ముందు నాని ఆయన దగ్గర పనిచేశారు. నాని తన సినిమాల్లో ఛాన్స్ వస్తే ఏదో ఒక రకంగా రాజమౌళిని గుర్తుకు తెచ్చుకుంటారు. నాని, శ్రద్ధా శ్రీనాధ్ నటించిన సినిమా ‘జెర్సీ’ తొలి రోజు నుంచి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తోపాటు పలువురు దర్శకులు జెర్సీ టీమ్ కు అభినందనలు తెలిపారు.
తాజాగా ఈ సినిమాపై రాజమౌళి కూడా స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. 'హృదయాన్ని హత్తుకునే సినిమా. అద్భుతంగా రాసిన, తీసిన సినిమా 'జెర్సీ'. వెల్‌డన్ గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా కోసం పనిచేసిన అందరూ గర్వపడతారు. నాని 'బాబు'.. జస్ట్ లవ్యూ అంతే' అని రాజమౌళి ట్వీట్ చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ జెర్సీపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ కుషీగా ఉంది.