సోమిరెడ్డికి అధికారుల ఝలక్
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు ఝలక్ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వ్యవసాయ శాఖ సమీక్ష జరుపుతానని..దమ్ముంటే ఎవరు ఆపుతారో ఆపండి అంటూ మీడియా ముందు సవాళ్ళు విసిరారు. తన సమీక్షను అడ్డుకుంటే కోర్టుకు వెళతానని ప్రకటించారు. ఎవరూ అడ్డుకోకుండానే సోమిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించేందుకు ఆయన మంగళవారం సచివాలయానికి వచ్చారు. సమీక్షకు హాజరు కావాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రత్యేక కమిషనర్ మురళీధర్‌రెడ్డితోపాటు ఇతర సిబ్బందికి ఆయన కార్యాలయం సమాచారం అందించింది. అయితే, ఎన్నికల కోడ్ ఉండటంతో సమీక్షకు హాజరయ్యే విషయంలో ఎన్నికల సంఘాన్ని అధికారులు స్పష్టత కోరారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి సమీక్షకు వారు దూరంగా ఉన్నారు. అధికారుల కోసం సచివాలయంలో ఉదయం నుంచి దాదాపు మూడు గంటలపాటు వేచి చూసిన మంత్రి సోమిరెడ్డి.. ఎంతకూ అధికారులు రాకపోవటంతో తిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, కరువు పరిస్థితులపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని భావించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని కొంత మంది మంత్రులు కూడా సమీక్షలపై లేనిపోని రచ్చ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్అమల్లో ఉన్నప్పుడు సమీక్షలు జరపకూడదు. కాదు కూడదు అని సమీక్షలు జరిపి ఆదేశాలు జారీ చేసినా వాటిని అధికారులు అమలు చేయరు. ఎన్నికలు పూర్తయి ఫలితాల కోసం వేచిచూస్తున్న తరుణంలో సమీక్షలు అంటే నైతికంగా కూడా కరెక్ట్ కాదు. నిజంగా సమీక్షల కోసం గగ్గోలు పెడుతున్న వారంతా సదరు పనులపై ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ లోనో..మరో రకంగానే సమాచారం పంపి పనులు జరిగేలాచూడాలని కోరవచ్చు. అవసరాన్ని బట్టి...అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ అటు చంద్రబాబు, ఇటు సోమిరెడ్డి కేవలం రాజకీయ రచ్చ కోసమే సమీక్షలు అంటూ హంగామా చేస్తు్న్నారు. ఒక్క నెలలో సమీక్షలు చేయకపోతే ఇక అంతా ఆగిపోతుందనే కలరింగ్ ఇవ్వటమే విచిత్రం.