మోడీతో ప్రియాంక పోటీ లేనట్లే
సస్పెన్స్ వీడింది. వారణాసిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయటంలేదని తేలిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రధాని మోడీపై పోటీ చేసిన అజయ్ రాయ్ నే మరోసారి తమ అభ్యర్ధిగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో వారణాసి బరిలో ప్రియాంక నిలిచే అంశం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు..రాహుల్ ఆదేశిస్తే పోటీకి తాను కూడా రెడీ అని ప్రియాంక గాంధీ కూడా ప్రకటించారు. కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ తెరపైకి అజయ్ రాయ్ వచ్చారు.
ప్రియాంక పోటీకి సై అన్నా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది అన్నది ఆసక్తికర పరిణామమే. అయితే ప్రియాంక గాంధీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుందని..అలాంటిది తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి..ప్రధాని మోడీపై ఓటమి పాలైతే ఆ ప్రభావం ఆమె రాజకీయ భవిష్యత్ పై ఉండే అవకాశం ఉండటంతో అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రియాంక కేవలం ప్రచారానికే పరిమితం అవుతారని భావిస్తున్నారు.